15-10-2025 12:03:54 PM
మణికొండ,(విజయక్రాంతి): ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబళించేస్తున్న భూ బకాసురులపై హెచ్‌ఎండీఏ అధికారులు(HMDA officials) ఉక్కుపాదం మోపారు. ఎన్నిసార్లు కూల్చివేసినా మళ్లీ మళ్లీ మొలుస్తున్న అక్రమ వెంచర్‌ను భారీ బందోబస్తు నడుమ నేలమట్టం చేశారు. ఈ ఘటన బుధవారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఉప్పర్‌పల్లిలోని జన చైతన్య వెంచర్‌కు(Jana Chaitanya Venture) సమీపంలో, ఈసి వాగును ఆనుకొని ఉన్న సుమారు రెండు ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారు.
కేవలం కబ్జా చేయడమే కాకుండా, ఏకంగా హద్దులు ఏర్పాటు చేసి ప్లాట్లుగా మార్చేశారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు(HMDA Enforcement Officers) బుధవారం ఉదయం ప్రత్యేక బృందాలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతరం ప్రొక్లెయినర్ల సహాయంతో అక్రమ వెంచర్‌లోని హద్దు రాళ్లను, నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు. గమ్మత్తేమిటంటే, ఇదే అక్రమ వెంచర్‌ను గతంలో రెవెన్యూ అధికారులు(Revenue officials) కూల్చివేశారు. అయినప్పటికీ, అధికారులు వెళ్ళిపోగానే కబ్జాదారులు మళ్లీ తమ పని కానిచ్చేశారు. ఈసారి హెచ్‌ఎండీఏ రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.