15-10-2025 12:06:55 PM
మణికొండ,(విజయక్రాంతి): నగర శివారు నార్సింగి పోలీస్ స్టేషన్(Narsingi Police Station) పరిధిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన మంచిరేవుల ఔటర్ రింగురోడ్డు సర్వీస్ రోడ్డుపై వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... ఎప్పటిలాగే రద్దీగా ఉన్న సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఓ వ్యక్తి వేలాడుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. అటుగా వెళ్తున్న వాహనదారులు ఈ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వెంటనే వారు 100 నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెట్టుకు వేలాడుతున్న వ్యక్తిని కిందకు దించి పరిశీలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వద్ద లభించిన వివరాల ఆధారంగా, అతడిని రాందేవ్ గూడకు చెందిన బుగ్గ రాములుగా గుర్తించారు. కుటుంబ సమస్యలా, ఆర్థిక ఇబ్బందులా లేక మరేదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.