calender_icon.png 28 November, 2025 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైన్స్ ఏర్పాటుపై ఆందోళన

28-11-2025 12:54:39 AM

  1. హయత్ నగర్, హస్తినాపురం డివిజన్లలో 

స్థానికుల నిరసనలు, ఫ్లెక్సీల ఏర్పాటు 

ఎల్బీనగర్, నవంబర్ 27: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తగా ఏర్పాటు చేయనున్న వైన్స్ షాపుల ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హయత్ నగర్, హస్తినాపురం డివిజన్ పరిధిలో కొత్తగా వైన్స్ లను ఏర్పాటుకు నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిని స్థానిక కాలనీ ప్రజలు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. హయత్ నగర్ డివిజన్ లోని మునగనూరు రోడ్డులో ఏర్పాటు చేయనున్న వైన్స్ షాపు ఏర్పాటును నిరసిస్తూ సుమారు పది కాలనీల ప్రజలు ఇటీవల ఆందోళన చేపట్టారు. ఇక్కడ మద్యం షాపు ఎత్తివేయాలని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

అలాగే, హస్తినా పురం డివిజన్ లోని శ్రీ రమణ కాలనీలోని వైన్ షాపు ఏర్పాటును అడ్డుకునేందుకు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా కాలనీల్లో ఉన్న మద్యం షాపుల వద్ద అనేక సమస్యలు వస్తున్నాయి. ఉదయం 10  నుంచి రాత్రి 11 గంటల వరకు మందుబాబులు మద్యం సేవించి రోడ్డుపై, ఫుట్ పాత్ లపై పడుకుని ఉన్న ఘటనలు రోజూ కనిపిస్తున్నాయి.  స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యా ర్థులు, ఉద్యోగస్తులు, ముఖ్యంగా మహిళలు రోడ్డుపై నడవడానికే భయపడుతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది.

బయటకు రావడమే మహిళలకు సవాలుగా మారింది. ఆయా వైన్స్ షాపుల వద్ద వాహనాల రాకపోకతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది.  వైన్ షాపు ఎదుట పార్కింగ్ లేకపోవడంతో వాహనాలను గల్లీలు, రహదారుల్లో ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. వైన్స్ షాపుల ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.