22-07-2025 12:00:00 AM
సిద్దిపేట, జులై 21 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమం ద్వారా ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకూ విద్యార్థుల రాక పెరిగిందని జిల్లాలో అధికారులు చూపిన లెక్కల మేరకు ఉపాధ్యాయుల సర్దుబాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం జిల్లాలో 209 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు.
కానీ ఈ ప్రక్రియలో నిబంధనలు పాటించకుండా మిత్రగణాలకు అనుకూలంగా బదిలీలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ప్రతి 220 మంది విద్యార్థులకు 9 మంది ఉపాధ్యాయులు ఉండాలి.
అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అవసరమైన చోట సబ్జెక్ట్ వారీగా, కాంప్లెక్స్, మండల, జిల్లా స్థాయిలో సర్దుబాటు చేయాలి. సీనియర్ ఉపాధ్యాయులు సర్దుబాటుకు వెళ్లేందుకు సుముకుత చెపితే అవకాశం కల్పించాలి. కొన్ని సంఘాల నాయకులు జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చి, తమకు అనుకూలమైన పాఠశాలలకు సర్దుబాటు అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రిలీవ్ కాలేని ఉపాధ్యాయుల వేదన..
కొంతమంది ఉపాధ్యాయులు తమకు అన్యాయం జరిగిందంటూ ప్రస్తుతం ఉన్న పాఠశాల నుంచి రిలీవ్ కాలేకపోతున్నారు. మరికొందరు అనుకున్నచోట బదిలీ కాకపోవడంతో సంఘాల సహాయంతో అధికారు లపై ఒత్తిడి పెడుతున్నారు.
కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు కఠినంగా వ్యవహరిం చడం వల్ల సర్దుబాటు ఉపాధ్యాయులు వెళ్లేందుకు మొహమాటపడుతున్నారు. ప్రభుత్వం జీతం తీసుకుంటూ విద్యార్థులకు సేవలు అందించకపోవడం దారుణమని స్థానికులు మండిపడుతున్నారు.
సర్దుబాటులో రహస్య ఒప్పందాలా?
ఇద్దరు ఉపాధ్యాయులు హైదరాబాద్ కు సమీపంలోని పాఠశాలకు సర్దుబాటు కావడం వెనక ఎలాంటి సిఫారసులు పనిచేశాయన్న దానిపై ప్రశ్నలు వెల్లువెత్తుతు న్నాయి. అసలు నియమిత మార్గదర్శకాల ప్రకారమే ఈ సర్దుబాటు జరిగాయా? లేక సంఘాల ఒత్తిడికి తలొగ్గారా అన్నదానిపై సమగ్ర విచారణ జరగాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉపాధ్యాయుల సర్దుబాటు అనేది విద్యారంగ బలోపేతానికి కీలకం.
కానీ ఇందులో రాజకీయం, ఒత్తిళ్ల మోత ఎక్కువైతే నష్టపోయేది విద్యార్థులే. కలెక్టర్ జోక్యం ద్వారా న్యాయం జరగాలని పాఠశాలలు, సంఘాలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి వివరణ కోరగా ఇలా స్పందిస్తూ 209 మంది ఉపాధ్యాయుల సర్దుబాటులో 150 మంది ఇప్పటికే రిలీవ్ అయ్యారు. మిగతా వారు మంగళవారం సాయంత్రం వరకు సంబంధిత పాఠశాలలకు చేరుకుంటారు. నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.