03-01-2026 12:05:35 AM
హైదరాబాద్, జనవరి2 (విజయక్రాంతి): కృష్ణా జలాల వాటా వినియోగంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పచ్చి అబద్ధాలాడుతూ, నీచరాజకీయం చేస్తూ కేంద్రాన్ని దూషించడం అలవాటుగా చేసుకున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. అందాల పోటీల మాదిరిగా హైదరాబాద్‌లో ‘జాతీయ అబద్ధాల పోటీలు’ నిర్వహిస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు మొదటి రెండు అవార్డులు దక్కుతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదని విమర్శించారు.
నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సింది పోయి ప్రజలను గందరగోళంలోకి నెట్టి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు నీచరాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటను విడుదల చేస్తూ... ప్రజా సమస్యల పరిష్కారం కావాల్సిన పవిత్రమైన అసెంబ్లీని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గు చేటన్నారు. 299 ఈఎంసీలు చాలని ఆయనే ఒప్పుకున్నారని కేసీఆర్‌ను విమర్శించారు. నదీ జలాల విషయంలో కేంద్రం పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.