19-01-2026 01:18:08 AM
ఆ పది నియోజకవర్గాలకు బాధ్యులు ఎవరు..?
మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో .. ఇన్‌చార్జ్ బాధ్యతలు మాకే ఇవ్వాలని పాతనేతల పట్టు
కాదు.. మేం చెప్పిన వారికే టికెట్లు అంటున్న ఎమ్మెల్యేలు
పాత, కొత్త నేతల కయ్యం
రెబల్స్ బరిలో ఉంటే ఎదురుదెబ్బే..
అధిష్ఠానం ఏ దిక్కోనని కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన
అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్రాంతి సంబురాల కన్నా ఇన్నర్ ఫైట్ హీటెక్కుతోంది. భోగిమంటల కన్నా ‘పాత.. కొత్త..’ హస్తాల ఫైర్ భగ్గుమంటోంది. కాంగ్రెస్‌పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు బాధ్యులు ఎవరనే కుంపటి కుతకుత ఉడుకుతోంది. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో ఇన్‌చార్జ్ బాధ్యతలు మాకే ఇవ్వాలని పాతనేతల పట్టు.. ‘కాదు కాదు.. మేం చెప్పిన వారికే బీఫారాలు.. టికెట్లు’ అంటున్న ఎమ్మెల్యేల తెట్టుతో అధిష్ఠానానికి దశ దిక్కులా తలబాదుకోవడం తప్ప ఏ దిక్కో తేల్చుకోలేని పరిస్థితి కన్పిస్తోంది.
సంక్రాంతి పండగ తర్వా త ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంటే.. ఆ పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పాతకొత్త నేతల అంతర్గత పోరుపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటోందనని క్యాడర్ ఆందోళన చెందుతోంది. పాత, కొత్త నేతల కయ్యం.. పొంచివున్న రెబల్స్ బరి.. పార్టీ సర్వేలు.. బీఫారాల లొల్లి.. గెలు పు గుర్రాల నినాదం.. పురపోరులో కాంగ్రెస్‌కు కలిసి వస్తాయా.. లేక ప్రతిపక్షాలకు అస్త్రాలవుతాయా.. వేచిచూడాలి మరి..!
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు వేగవం తం చేస్తుంది. వార్డుల వారీగా ఓటర్ల సంఖ్యను కూడా ప్రకటించడంతో పాటు సంక్రాంతి పండుగ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల వేడి రాజుకుంటున్నది. అయితే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను ఎదర్కోవడానికి సమాయత్తం అవుతుంటే.. అధికార కాంగ్రెస్ మాత్రం అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో కొందరు నాయకులు కయ్యానికి కాలుదువ్వుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ప్రధానంగా బీఆ ర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నాయకుల మధ్య పాత, కొత్త పంచాయితీ మరింత తీవ్రమవుతోంది. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ఇన్‌చార్జీతో పాటు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు బీఫారాలు అందించే బాధ్య తలను తమకే ఇవ్వాలని పాత కాంగ్రెస్ నాయకులు పట్టుబడుతున్నారు. పార్టీ అధిష్ఠానం మాత్రం బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. అయితే పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు.. తాము బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మేనని, నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశామని ఐదుగురు ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారనే చర్చ జరుగుతోంది.
ఇదే విష యాన్ని పాత కాంగ్రెస్ నేతలు తెరపైకి తెస్తున్నా రు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పార్టీ గుర్తులపైన జరుగుతుండటంతో.. ఇన్‌చార్జ్ బాధ్యతలు ఎవవరికి ఇవ్వాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ తేల్చుకోలేని పరిస్థితిలోకి నెట్టబడింది. ప్రధానంగా జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నది. మొదటి నుంచి వీరిమధ్య సఖ్యతలేకపోగా, సమయం వచ్చినప్పుడుల్లా ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఇక భాన్సువాడ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మధ్య పంచాయితీ నడుస్తూనే ఉంది.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిర, గద్వాలలో సరితాతిరుపతయ్యయాదవ్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చేవెళ్లలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ భీమ్ భరత్, రాజేంద్రనగర్‌లో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు కాంగ్రెస్‌కు చెందిన మరికొందరు నాయకుల మధ్య పొసగడం లేదు. వీటితో పాటు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ సీనియ ర్లు, జూనియర్ల మధ్య కూడా నిత్యం వివాదా లు జరుగుతూనే ఉన్నాయి. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లాలో పాలకుర్తి, నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడతో పాటు చాలా నియోజక వర్గాల్లోనూ సొంత పార్టీ నాయకల మధ్య కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
రెబల్స్ బరిలో ఉంటే ఎదురుదెబ్బే..
అధికార కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగిలే పరిస్థితి కనిపిప్తోంది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే.. పట్టణాల్లో రెబల్స్ బెడద అధికంగా ఉండే ప్రమాదం తప్పదనే చర్చ జరుగుతోంది. పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగిస్తే.. పాత కాంగ్రెస్ నాయకులు రెబల్స్‌గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ పార్టీకి చెందిన పాత నాయకులకు ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తే.. కొత్త గా కాంగ్రెస్‌లో వచ్చిన కేడర్ సహకరించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ పురపోరులో విచిత్ర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే పార్టీ పరంగా సర్వేలు నిర్వహించి గెలిచే వారికే టికెట్లు అనే నినాదంతో ముందుకెళ్లాలనే యోచనలో కాంగ్రెస్ నాయకులు న్నారు. ఇది స్థానిక సంస్థల్లో వర్కవుట్ కాదని గాంధీభవన్ వర్గాల నుంచి వినపిస్తోంది.