calender_icon.png 28 September, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసేదే మీడియా

28-09-2025 01:09:55 AM

  1. ఆవిష్కర్తలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుంది
  2. ‘పిచ్2ప్రెస్’ ద్వారా స్టార్టప్‌లకు అద్భుత అవకాశం
  3. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): సమాజాన్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసేది మీడియానే అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అదే తరహాలో ఆవిష్కరణలకు కూడా ప్రభావితం చేసేందుకు అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) ఆధ్వర్యంలో పిచ్2ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఆవిష్కర్తలకు, ప్రజలకు మధ్య వారధిగా మీడియా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. పిచ్2ప్రెస్ కార్యక్రమం ద్వారా స్టార్టప్‌లకు ఈ అవకాశం కల్పించడం గొప్ప విషయమని ప్రశంసించారు. వార్తాకథనాల ద్వారా ప్రజల్లో నమ్మకం పెరగడంతోపాటు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఎంతో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. అనేక మంది స్టార్టప్‌లకు సరైన వేదికగా పిచ్2ప్రెస్ కార్యక్రమం నిలుస్తోందన్నారు.

స్టార్టప్‌లకు పెట్టుబడిదారుల అవసరం ఎంతో ఉందని, వారికి మధ్య వారధిగా వ్యవహరించే విధంగా కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానానికి నైపుణ్యం కావాలని 1980లోనే అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ చెప్పినట్టు గుర్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంపై అప్పట్లో దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం అన్ని రాష్ట్రాల్లో పునాదులు వేసిందన్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాంకేతిక అభివృద్ధి అనేక నిర్ణయాలు తీసుకున్నామని, వాటి కారణంగానే ఇప్పుడు అనేక బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్‌లో వెలిశాయని స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలను గుర్తించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ ముందే ఉన్నాయని, సాంకేతిక పరిజ్ఞానం అవసరాన్ని గుర్తించి, తమ సొంత గ్రామమైన ధన్వాడలో పూర్తిస్థాయిలో డిజిటల్ లిటరసీని పెంచామని గుర్తు చేశారు.

సాంకేతికత అంటే సంక్లిష్టమైనది అనుకుంటామని, కానీ టెక్నాలజీ అంటే రాకెట్ సైన్స్ ఏమీ కాదన్నారు. తెలంగాణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నామని తెలిపారు. సాంకేతికత ను ఉపయోగించి ఇతర రంగాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పిస్తున్న తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) సంస్థను అభినందించారు.