calender_icon.png 28 September, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంచెత్తిన మూసీ

28-09-2025 01:04:32 AM

హైదరాబాద్‌లో మూసీ జలప్రళయం

30 ఏళ్లలో చూడని వరద బీభత్సం

  1. ఉస్మాన్‌సాగర్ 15 గేట్లు ఎత్తివేత
  2. నీట మునిగిన బస్తీలు, వంతెనలు, ఎంజీబీఎస్
  3. తాత్కాలికంగా ఎంజీబీఎస్ మూసివేత
  4. వరద బాధితులకు డ్రోన్లతో ఆహారం
  5. పురానాపూల్ వద్ద 13 అడుగుల ఎత్తులో మూసీ ప్రవాహం
  6. నీట మునిగిన చారిత్రక శివాలయం, హిందూ శ్మశానవాటిక 
  7. పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు

హైదరాబాద్‌లో మూసీ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నది. శనివారం నది పరీవాహక ప్రాంతాలు జలమయం కావడంతో ముంపువాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎగువన కురిసిన భారీ వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రికార్డు స్థాయిలో వరద చేరింది. అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు రెండు జలాశ యాల గేట్లను ఎత్తివేశారు. దీంతో 30 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా నది ఉగ్రరూపం దాల్చి మహానగరాన్ని ముంచెత్తింది.

బాపూఘాట్ నుంచి మూసారాంబాగ్ వరకు నది ఉప్పొంగడంతో పరీవాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చారిత్రక వంతెనలు, బస్తీలతోపాటు రాష్ట్రానికే తలమానికమైన ఎంజీ బస్టాండ్ సైతం నీట మునిగింది. దీంతో ఎంజీబస్టాండ్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆర్టీసీ యాజ మాన్యం ప్రకటించింది. బస్సులను దారి మళ్లించడంతో హైదరాబాద్‌లోని రోడ్లన్నీ రద్దీగా మారాయి.

పురానాపూల్ వద్ద మూసీ 13 అడుగుల వద్ద మూసీ ప్రవహిం చింది. అక్కడి చారిత్రక శివాలయంలో చిక్కుకుపోయిన పూజారి కుటుంబాన్ని రెస్క్యూ సిబ్బంది అతి కష్టం మీద కాపాడారు. అధికారులు మూసానగర్, శంకర్‌నగర్, అంబేద్కర్‌నగర్ వంటి ముంపు ప్రాంతాలకు చెందిన వందలాది కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఇళ్లు ఖాళీ చేయడానికి నిరాకరించిన వారిని పోలీసులు బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో మోహరించి, సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షా లకు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు జంట జలాశయాల్లోకి వరద పోటెత్తింది. శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఉస్మాన్‌సాగర్‌కు చెం దిన 15 గేట్లను ఏకంగా 9 అడుగుల మేర ఎత్తి 35,000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేశారు.

హిమాయత్‌సాగర్ నుంచి కూడా 21,450 క్యూసెక్కుల నీటిని వదలడంతో, మూసీలోకి ఒక్కసారిగా 36,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ వద్ద మూసీ వరద ఉధృతికి మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ లోలెవల్ వంతెనలు పూర్తిగా నీట మునిగాయి. మూసారాంబాగ్ పాత వంతెనపై 10 అడుగుల ఎత్తున, చాదర్‌ఘాట్ వంతెనపై 6 అడుగుల ఎత్తున వరద ప్రమాదకరంగా ప్రవహించింది.

ఈ ప్రవాహానికి మూసారాంబాగ్‌లో కొత్తగా నిర్మిస్తు న్న వంతెన స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన ఇనుప సామగ్రి మొత్తం కొట్టుకుపోయింది. పురానాపూల్ వద్ద మూసీ 13 అడుగుల ఎత్తులో ప్రవహించడంతో, అక్కడి చారిత్రక శివాలయం, హిందూ శ్మశానవాటిక నీట మునిగాయి. గుడిలో చిక్కుకుపోయిన పూజారి కుటుంబాన్ని అధికారులు అతి కష్టం మీద కాపాడారు. 

పునరావాస కేంద్రాలకు తరలింపు

హైదరాబాద్‌లోని మూసానగర్, శంకర్‌నగర్, అంబేద్కర్‌నగర్ వంటి బస్తీలు పూర్తి గా జలమయం కావడంతో, వందలాది కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇళ్లు ఖాళీ చేయడానికి నిరాకరిం చిన వారిని పోలీసులు బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. మూసారాం బాగ్ బ్రిడ్జి సమీపంలో నీటమునిగిన ఐదు కార్లు, ట్రావెల్స్ బస్సు, బ్రిడ్జి సమీపంలోని వారిని రాత్రి పునరావాస శిబిరాలకు తరలించారు.

కార్లు, వాహనాలను వదిలేసి శిబిరాల కు వెళ్లిపోయిన ముంపు బాధితులు వెళ్లడంతో.. అర్ధరాత్రి నీటిప్రవాహం పెరిగి ఇళ్ల ముందు నిలిపి ఉంచిన వాహనాలు నీట మునిగాయి. మూసారాంబాగ్ వద్ద మూసీలోకి కొన్ని వాహనాలు కొట్టుకుపోయాయి. హైడ్రా సిబ్బంది మూసీ వద్ద కట్టిన తాళ్లు అడ్డుగా ఉండటంతో కొన్ని వాహనాలు నిలిచిపోయాయి.

ఊహించిన దానికన్నా ఎక్కువ వర్షాలు: మంత్రి పొన్నం 

క్షేత్రస్థాయిలో మంత్రులు, అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కమిషనర్ ఆర్‌వి కర్ణన్, కలెక్టర్ హరిచందన శనివారం ఉదయం వరద ప్రభావిత ప్రాం తాల్లో పర్యటించారు. చాదర్‌ఘాట్ వంతెన, ఎంజీబీఎస్, పునరావాస కేంద్రాలను పరిశీలించి, బాధితులకు అందుతున్న సహాయం పై ఆరా తీశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. “ప్రకృతిని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. ఊహించిన దానికన్నా ఎక్కువ వర్షాలు కురిశాయి. సీఎం ఆదేశాలతో ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసు కున్నాం. పునరావాస కేంద్రాల్లో ఆహా రం, పాలు, తాగునీరు అందిస్తున్నాం.

పండగ పూట ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్సులు నడుపుతు న్నాం. ఉత్తర తెలంగాణకు జేబీఎస్ నుంచి, వరంగల్‌కు ఉప్పల్ నుంచి, నల్గొండకు హయత్‌నగర్ నుంచి, మహబూబ్ నగర్‌కు ఆరాంఘర్ నుంచి బస్సులు నడుస్తాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ప్రతిపక్షాలు ఈ సమయంలో రాజకీయం చేయడం తగదు” అని హితవు పలికారు.

ముంపు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్

హైడ్రా కమిషనర్  రంగనాథ్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. చాదర్‌ఘాట్, మూసారాంబాగ్, ఎంజీబీఎస్ బస్టాండ్ తదితర ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్య టించి, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. చాదర్‌ఘాట్‌లోని నివాస ప్రాం తాల్లో పర్యటించిన ఆయన, అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలోనే ఉండి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని స్థానికులకు విజ్ఞ ప్తి చేశారు.

వరదలో చిక్కుకుని భవనాలపైనే ఉండిపోయిన వారికి డ్రోన్ల సహాయం తో ఆహార పొట్లాలు అందజేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం ఎంజీబీఎస్‌ను సంద ర్శించిన కమిషనర్.. మూసీ నది రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో వరద నీరు లోపలికి ప్రవేశించిన ప్రాంతాలను పరిశీలించారు.

శుక్రవారం అర్ధరాత్రి వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయినప్పుడు, హైడ్రా డీఆర్‌ఎఫ్, పోలీస్, ఆర్టీసీ, జీహెఎంసీ సిబ్బం ది సమన్వయంతో పనిచేసి వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడాన్ని ఆయన అభినందించారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందు లు రాకుండా డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆందోళన వద్దు: జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముంపునకు గురై న ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధై ర్యం చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. మూసీ ఉధృతి నేపథ్యంలో కమిషనర్ తొలుత మూసారాంబాగ్ వద్ద నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన పనులను పరిశీలించారు.

అనంతరం కమిషనర్ అంబర్‌పేట సర్కిల్‌లోని గోల్నాక లంక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సం దర్శించారు. కేంద్రంలో అందిస్తున్న భోజ నం, తాగునీరు, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. బాధితులకు ఎలాంటి లోటు రాకుం డా అన్ని మౌలిక వసతులు కల్పించాలని, 24 గంటలూ అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

నీట మునిగిన ఎంజీబీఎస్

మూసీ వరద మహాత్మాగాంధీ బస్ స్టేషన్(ఎంజీబీఎస్)ను ముంచెత్తింది. బస్టాండ్ లోకి వెళ్లే రెండు ప్రధాన వంతెనలు నీట మునగడంతో, బస్టాండ్ ప్రాంగణం చెరువును తలపించింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు అర్ధరాత్రి బస్టాండ్‌లో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి, అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడంతో, రెస్క్యూ బృం దాలు తాళ్ల సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఎంజీబీఎస్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 

బస్సుల దారి మళ్లింపు

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను దారి మళ్లించినట్లు అధికారులు వివరించారు. ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు దిల్‌సుఖ్‌నగర్ వరకే అనుమతించారు. కర్నూలు, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్ వరకే నడిపేలా చర్యలు చేపట్టారు. వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ వరకే అనుమతించారు.