18-11-2025 12:00:00 AM
ఇందిరమ్మ ఇళ్లల్లో దీపం వెలిగించిన కిచ్చెన్న
మహేశ్వరం, నవంబర్ 17 (విజయ క్రాంతి) : ఇందిరమ్మ పాలన నుంచి నేటి సీఎం రేవంత్ రెడ్డి వరకు అట్టడుగు వర్గాలకే తొలిప్రాధాన్యం ఇవ్వాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.సోమవారం తుక్కుగూడ మున్సిపాలిటీ బాసగూడ, మహేశ్వరం మండలం నాగారం పడమటితండా, కందుకూరు పట్టణంలో నూతనంగా ఇందిరమ్మ ఇళ్లల్లో గృహప్రవేశం చేసిన లబ్దిదారులను ఆయన ప్రత్యేకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ,సొంత ఊర్లో.. సొంత కుటుంబ సభ్యులతో ఉండేలా ఇందిరమ్మ ఇళ్లకు రూ.5లక్షలు ఇస్తున్నామని చెప్పారు. ఊరు బయట ఎక్కడో కడితే డబుల్ బెడ్ రూమ్స్ కు వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడలేదని గుర్తు చేశారు. నాడు ఇందిరమ్మ కాలనీలను కట్టించిన ఘనత కూడ కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ఏటా 3500 బడుగు, బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన చెప్పారు.
మేస్త్రీలు, కూలీలు, మెటీరియల్ కొరత లేకుండా ఉండేందుకు విడతలవారీగా పేదలకు గూడు కట్టిస్తామని కిచ్చెన్న హామీ ఇచ్చారు. ఇల్లు లేని నిరుపేదలు ఉండకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలపై ఉందన్నారు.ఇందిరమ్మ లబ్దిదారులతో కలిసి గృహప్రవేశం చేసి పేదోడి ఇంట దీపం వెలిగించారు.ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.