18-11-2025 12:00:00 AM
మంచిర్యాల, నవంబర్ 17 (విజయక్రాంతి): రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేస్తారని అందరికీ తెలుసు. కానీ మంచిర్యాల జిల్లాలోని కొన్ని రేషన్ దుకాణాలకు నూకలు సరఫరా అవుతున్నాయి. అంతేకాకుండా వినియోగానికి పనికిరాని సన్న బియ్యం కూడా సరఫరా అవుతున్నది. అధికారుల చేతివాటంతో నాసిరకం బియ్యం రేషన్ దుకాణాలకు చేరినట్టుగా తెలుస్తున్నది.
చాలా మంది లబ్ధిదారులు రంగు మా రిన, నూక శాతం ఎక్కువగా ఉన్న బియ్యాన్ని అయిష్టంగానే తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల రేషన్ డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మంచిర్యాల, లక్షెట్టిపేట, బెల్లంపల్లి, చెన్నూర్, తాండూరు, కోటపల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్‌ల నుంచి 423 రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా అవుతుంది.
రేషన్ డీలర్లు ఈధూవూ మిషన్ ద్వారా లబ్ధిదారుల వేలి ముద్ర తీసుకొని లేదా ఓటీపీ నెంబర్ లేదా ఐరీష్ పద్దతుల ద్వారా సాధారణంగా రేషన్ పంపిణీ చేస్తుంటారు. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభించి 15 తేదీ వరకు పంపిణీ చేయాల్సి ఉంటుంది.
మారుమూల ప్రాంతాలకు సరఫరా చేయడం వల్ల కానీ, జిల్లాలో పంపిణి చేయాల్సిన కోట ప్రకారం నిలువలు లేకుంటే రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరాలో ఆలస్యమైతే సాధా రణంగా వెసులుబాటు కల్పిస్తుంటారు. ఈ క్రమంలో జిల్లాలో సన్న బియ్యం నిల్వలు తక్కువ ఉండటంతో పక్క జిల్లాల నుంచి సన్న బియ్యం దిగుమతి చేసుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఈసారి మాత్రం నాణ్యత లేని బియ్యం రావడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
పెద్దపల్లి జిల్లా నుంచి బియ్యం సరఫరా
నవంబర్ నెలకు మంచిర్యాల జిల్లాలో 2,52,386 కార్డుల పరిధిలోని 7,47,704 యూనిట్లకు 4,753.629 టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాకు అవసరమైన బియ్యం ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో అందుబాటులో లేకపోవడంతో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారులు సమీప పెద్దపల్లి జిల్లాలోని ఎస్‌డబ్ల్యూసీ గోదాంల నుంచి జిల్లాలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తీసుకొచ్చారు.
అక్కడ నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా వచ్చిన బియ్యం అంతా నాణ్యత లేకుండా కొంత మేర రంగు మారి, నూక శాతం ఎక్కువగా ఉండటంతో సన్న బియ్యం అంటూ చెత్తా, చెదారం పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బియ్యాన్ని పరిశీలించే తెప్పించారా?
ఏ జిల్లాలోనైనా మిల్లర్ వద్ద నుంచి ఏసీకే బియ్యం సివిల్ సప్లయ్ అధికారుల ఆదేశాల మేరకు కోటా ప్రకారం రాష్ట్రం (సీఎస్సీ)కి కానీ, కేంద్రం (ఎఫ్‌సీఐ)కి కానీ పంపిస్తుంటారు. అయితే మిల్లు నుంచి వచ్చిన ఆ బియ్యాన్ని సాంకేతిక అధికారులు నాణ్యత పరీక్షించాకే ఆ మిల్లుకు కేటాయించిన బెడ్‌పై దింపేందుకు అనుమతిస్తుంటారు. ఇంత పకడ్బందీగా జరిగే ఈ ప్రక్రియలో అధికారుల చేతివాటంతో నాణ్యత లేని బియ్యాన్ని దించి రేషన్ షాపులకు పంపిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి.
మంచిర్యాల జిల్లాలో రేషన్ దుకాణాలకు పంపించాల్సిన కోటా బియ్యం లేకపోవడంతో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారులు ఇతర జిల్లాల నుంచి బియ్యం ను పరిశీలించిన అనంతరమే జిల్లాలో దించుకుంటారు. ఈ నెల పెద్దపల్లి నుంచి దిగుమతి చేసుకున్న బియ్యంలో నాణ్యత లోపించడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. బియ్యాన్ని పరిశీలించే తెప్పించారా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల నిర్లక్ష్యంతోనే..
ఇతర జిల్లాల్లోని ఎస్‌డబ్ల్యూసీ గోదాంల నుంచి మంచిర్యాల జిల్లాకు బియ్యం తీసుకువచ్చే క్రమంలో జిల్లాకు చెందిన సివిల్ సప్ల య్ కార్పొరేషన్ టెక్నికల్ అధికారులు నాణ్య త పరిశీలించి తీసుకురావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు సన్న బియ్యంలో 25 శాతం నూకకు అనుమతి ఉంది. అంటే 75 శాతం తప్పకుండా నాణ్యమైన బియ్యం ఉండాలి.
కానీ ప్రస్తుతం జిల్లాకు వచ్చిన బియ్యం రిసైక్లింగ్ చేసిన, 25 శాతానికి మించి నూక ఉన్న, రంగు మారిన, చెడిపోయిన బియ్యం వచ్చింది. ఈ బియ్యం అంతా పెద్దపల్లి జిల్లాలోని సుద్దాల 1, 2 గోదాంల నుంచి వచ్చినట్లు సమాచారం.
టెక్నికల్ అధికారులు బెడ్ పై ఉంచిన రేషన్ బియ్యం సంచుల్లో నుంచి పోకర్ పెట్టి బియ్యం శాంపిల్ తీసి గింజ రంగు (గ్రెయిన్ చేంజ్), నూక శాతం పరిశీలించి వినియోగపరంగా ఉన్నాయా లేవా పరిశీలించి తీసుకు రావాలి. సంబంధిత శాఖ అధికారుల నిర్ల క్ష్యం కారణంగా ఇలా ఓల్ స్టాక్ లేదా సార్టెక్స్ పాస్ కానివి, పక్కకు పెట్టిన బియ్యంను సీల్ బ్యాగుల్లో పంపినట్లు తెలుస్తుంది.