30-07-2025 01:44:00 AM
వికారాబాద్, జూలై- 29 (విజయక్రాంతి): ఓ వైపు అభివృద్ధి, మరోవైపు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తీర్చుతూ ప్రజా పాలనను చేస్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో చేపట్టని పనులన్నింటినీ పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. తాండూర్ నియోజకవర్గానికి రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో రేషన్ కార్డు లేని అర్హులైన పేదవారికి కార్డులను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కోటి 20 లక్షల కుటుంబాలకు గాను 95 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు.
మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అంద జేస్తున్నామని, ఒక సంవత్సరంలోనే 21 వేల కోట్ల రుణాలను అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని తెలిపారు. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రానికి సమర్పించినట్లు తెలిపారు.
రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే: మంత్రి శ్రీధర్‌బాబు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల వరకు మాఫీ చేసిన ఘనత తమదేనని అన్నారు. అంతేగాక మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని సాఫీగా జరిగేటట్టు చూస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డులు రానివారు మరోమారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రేషన్ కార్డు తీసుకున్న వారికి వచ్చే నెల నుంచి రేషన్ సరఫరా అవుతుందని తెలిపారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి పనులు నాసిరకంగా చేశారని తాండూర్ నదిపై బ్రిడ్జి, బ్యారేజ్ నిర్మాణం చేసి రెండేళ్లు గడిచిన తర్వాత భారీ రంద్రం పడిందని తెలిపారు. ఈ విషయమై తగు విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.