25-11-2025 07:39:00 PM
ఎమ్మెల్యే వేముల వీరేశం..
నకిరేకల్ (విజయక్రాంతి): మహిళల ఆర్థిక శక్తిని పెంపొందించి ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ సంకల్పమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని శంకుతల ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ₹15 కోట్లు 68 లక్షల విలువైన వడ్డీ రహిత రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని తెలిపారు.
“మహిళను బలపర్చడం అంటే ఒక కుటుంబం, సమాజం, భవిష్యత్తు తరాలకు అండగా నిలిచినట్టే. మహిళ ఎదుగుదల ఒక ఇంటి గౌరవమే కాదు, రాష్ట్ర పురోగతి. మహిళా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం,” అని అన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పి.డి శేఖర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి, నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజితశ్రీనివాస్, పి.ఎస్.సి.ఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.