24-10-2025 10:37:19 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల సమన్వయ సమావేశంలో తహశీల్దార్ శ్రీకాంత్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని,ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని తహాశీల్దార్ భాషపాక శ్రీకాంత్ అన్నారు.మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం మండలంలోని అన్ని శాఖల అధికారులు,అన్ని గ్రామాల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పొలాల వద్ద ధాన్యాన్ని సరిగ్గా ఆరబెట్టుకుని కేంద్రాలకు తీసుకువచ్చేలా సంబంధిత వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
ఆయా గ్రామాల్లోని కేంద్రాల వద్ద గన్నీబ్యాగులు, టార్ఫాలిన్లు, తూకం యంత్రాలు, ప్యాడీక్లీనర్లు, తేమ నిర్ధారణ యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వరిధాన్యం సేకరణ జరగాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు లారీల ద్వారా తరలించే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద గత సీజన్ లో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ముందస్తుగా తగిన ఏర్పాటు చేసుకొని,సమన్వయంతో పనిచేయాలన్నారు.