calender_icon.png 28 October, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 గుంటల భూమిపై కాంగ్రెస్ నేత కన్ను!

28-10-2025 01:28:29 AM

-‘షాడో నేత’కే తొత్తులుగా మారిన పోలీసులు?

-కూకట్‌పల్లి శంషీగూడలోని భూ కబ్జాకు యత్నం

-అడ్డుకుంటే సొంత పార్టీ వారే ప్రాణాలు తీస్తామంటున్నరు

-కాంగ్రెస్ సీనియర్ నేత వీవీవీఎస్‌ఎన్ చౌదరి

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): నగరంలోని కూకట్‌పల్లిలో తన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అడ్డుకుంటే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వివివిఎస్‌ఎన్ చౌదరి ఆరోపించారు. ఈ విషయంలో న్యాయస్థానం నుంచి తనకు అనుకూలంగా ఉత్తర్వులు ఉన్నప్పటికీ, స్థానిక పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తూ తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి మండలం శంషీగూడ గ్రామంలోని సర్వే నంబర్ 39లో గల 25 గుంటల భూమికి వివివిఎస్‌ఎన్ చౌదరి పూర్తి హక్కుదారు. ఈ భూమిని ఆయన 2005లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసి, చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు.

2016 నుంచి డి శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులు డి శ్యామ్ రావు, డి రాజు, డి బాబిత ఈ భూమిపై కన్నేశారు. 338.4 గజాల స్థలం గ్రామ కంఠానికి చెందినదంటూ నకిలీ పత్రాలు సృష్టించి కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఆ భూమికి, చౌదరి భూమికి సంబంధం లేదని 2019లో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా, నిందితులు తన భూమిలోకి అక్రమంగా ప్రవేశించకుండా నిలువరించాలని కోరుతూ చౌదరి కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం నిందితులను అడ్డుకుంటూ తాత్కా లిక ఇంజక్షన్ ఉత్తర్వులను జారీ చేసింది. కోర్టు ఇంజక్షన్ ఉత్తర్వులు ఉన్నప్పటికీ నిందితులు తమ దౌర్జన్యం ఆపలేదు.

చౌదరి తన కుమార్తె వివాహ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో, నిందితులు ప్రహరీ గోడను కూల్చివేసి, అక్రమంగా ఒక గదిని నిర్మించి, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, జలమండలి అధికారులను తప్పుదోవ పట్టించి దానికి ఇంటి నంబర్, నల్లా కనెక్షన్ కూడా పొందా రు. దీనిపై 2019లో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ఏళ్ల తరబడి జాప్యం చేశారు. హైకోర్టును ఆశ్రయించిన తర్వాతే పోలీసులు నిందితులపై ఐపీసీ పలు సెక్షన్‌ల కింద ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయినప్పటికీ నిందితుల నుంచి బెదిరింపులు ఆగకపోవడంతో, గత రెండు సంవత్సరాలుగా పలుమార్లు ఏసీపీ, డీసీపీ కార్యాల యాల చుట్టూ తిరిగానని చౌదరి తన ఆవేదనను వెలిబుచ్చారు. 

“భూమిలోకి వస్తే చంపేస్తాం” అని నిందితులు బెదిరిస్తుంటే, పోలీసు అధికారులు మాత్రం సంబంధిత ఎస్సు సెలవులో ఉన్నా రు, గ్రూప్ 1 పరీక్షలకు సిద్ధమవుతున్నారు వంటి సాకులు చెబుతూ తనను తిప్పించుకున్నారని వాపోయారు. డీసీపీని కలిస్తే ఏసీపీతో మాట్లాడుకోలేదా అని, ఏసీపీని కలిస్తే సరైన స్పందన ఇవ్వలేదు.

ఇటీవల తన భూమిలో మరమ్మతులు చేస్తుండగా నిందితులు వచ్చి కూలీలను బెదిరించి, సైన్ బోర్డును, ప్రహరీని ధ్వంసం చేశారు. ఈ దారుణాలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా, బాధితుడైన తనపైనే కూకట్‌పల్లి పోలీసులు  కేసు నమోదు చేయడం దారుణము. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తనపైనే కేసు పెట్టారని ఆయన పేర్కొన్నారు.

సొంత పార్టీ అధికారంలో ఉన్నా న్యాయం జరగడం లేదు: వీవీవీఎస్‌ఎన్ చౌదరి

నా సొంత పార్టీ అధికారంలో ఉన్నా నాకు న్యాయం జరగడం లేదు. పార్టీలోనే ఒకరు ‘షాడో నేత’లా తయారయ్యారు. అన్ని సెటిల్మెంట్లు ఆయన దగ్గరే జరుగుతున్నాయి. ఇప్పుడు నా భూమి మీద పడ్డారు. ఆయన కనుసన్నల్లోనే సైబరాబాద్ పోలీసులు పనిచేస్తున్నారు. కబ్జాదారులకు రక్షణ కవచంగా మారి, బాధితుడినైన నన్నే వేధిస్తున్నారు. పోలీసులే కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా డి శ్రీనివా స్, అతని కుటుంబ సభ్యులు నా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యాయస్థానంలోనూ వారికి చుక్కెదురైంది. భూమి నాదేనని, వారి వాదనల్లో పసలేదని కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. నా భూమిలోకి వారు ప్రవేశించకుండా ఇంజక్షన్ ఉత్తర్వులు కూడా ఉన్నాయి.

కానీ, ఈ కాగితాలకు ఇక్క డి పోలీసుల వద్ద విలువే లేదు. ఎందుకం టే, తెర వెనుక కథ నడిపిస్తున్నది మా పార్టీలోని ఓ అధికార కేంద్రం. ఈ మధ్యే నా సైట్‌లో పనులు మొదలుపెడితే, అనిల్‌రెడ్డి అనే వ్యక్తి వచ్చి జేసీబీని ఆపేశాడు. ఆయన (షాడో నేత ఉద్దేశిస్తూ) చెప్పారని, జోక్యం చేసుకోవద్దని అంటున్నాడు. నా దగ్గర కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్పినా వినడం లేదు. అంటే, ఈ రాష్ర్టంలో కోర్టుల కన్నా ఓ పైరవీకారుడి మాటే చెల్లుబాటు అవుతోందా? పోలీసులు కబ్జాదారులకు వాచ్ మెన్లుగా మారారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎస్సు లేరని, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని సిగ్గులేకుండా సమాధానం చెబుతు న్నారు. డీసీపీని ఆరుసార్లు కలిస్తే, ‘ఏసీపీతో మాట్లాడుకోపోయావా?’ అంటూ నిర్లక్ష్యం గా మాట్లాడుతున్నారు.

బాధితుడినైన నాపై నే ఎదురు కేసులు పెడుతున్నారు. ఇది పోలీసుల దౌర్జన్యం. కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య ఓ ‘షాడో నేత’ తయారయ్యాడు. అన్ని పైరవీలు, సెటిల్మెంట్లు ఆ ‘బాయ్’ దగ్గ రే జరుగుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. ఎందరో బాధితులు ఆయన వల్ల నష్టపోతున్నారు. ఇప్పుడు నా భూమిని కూడా కబ్జా చేసేందుకు ఆయన చక్రం తిప్పుతున్నాడు. ఆయన అండ చూసుకునే డి శ్రీనివాస్ ముఠా, పోలీసులు ఇంతలా బరితెగిస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో తేల్చాలి. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న నాకే ఈ గతి పడితే, సామాన్యుల పరిస్థితి ఏంటి.

కోర్టు ఉత్తర్వులు చేతిలో పట్టుకుని, న్యాయం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతు న్నా. కానీ ఫలితం శూన్యం. కబ్జాదారులు నా ప్రహరీ కూల్చి, అక్రమ నిర్మాణం చేసి, ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కూడా పొందారంటే దీని వెనుక ఎంత పెద్ద కుట్ర ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది నాకు జరుగుతున్న అన్యాయం మాత్రమే కాదు, అధికార మదంతో ఒక సామాన్యుడిని ఎలా తొక్కేయొచ్చో చెప్పేందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు, వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఈ పోలీస్, -కబ్జాదారుల ముఠాపై, వారి వెనుకున్న అదృశ్య శక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాకు, నా ఆస్తికి రక్షణ కల్పించి న్యాయం చేయాలి.