28-10-2025 01:28:30 AM
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఆటోడ్రైవర్ల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్, అధికార పగ్గాలు వచ్చిన తర్వాత వారి బాగోగులు మరచిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఆటోడ్రైవర్ల జీవితాలు దుర్భరంగా మారాయని వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆటోలో తిప్పిన యాజమాని మష్రత్ అలీ, ఇప్పుడు డ్రైవర్‌గా మిగిలాడని తెలిపారు.
సోమవారం ఆయన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి తెలంగాణ భవన్ వరకు మష్రత్ అలీ ఆటోలో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయన ఆటోడ్రైవర్‌తో మాట్లాడారు. డ్రైవర్ సాధక బాధకాలు తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఆటోడ్రైవర్లతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికల ముందు మష్రత్ అలీ రెండు ఆటోల యజమానిగా ఉండేవాడని, రాహుల్ గాంధీని తానే స్వయంగా హైదరాబాద్‌లో నగరంలో ఆటోలో తిప్పాడని గుర్తుచేశారు.
ఇప్పుడా డ్రైవర్ రెండు ఆటోలు అమ్ముకుని, డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ ఆటోకు కిరాయి చెల్లిస్తూ, ఆటో నడుపుతూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని తెలిపారు. వచ్చే అరకొర ఆదాయం పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే, ఆటోడ్రైవర్ల జీవితాలు ఇలా ఉండేవి కావని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రప్రభుత్వం మెడలు వంచి బీఆర్‌ఎస్ ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయిస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహ త్య చేసుకున్నారని తెలిపారు. ఇదే విషయా న్ని బీఆర్‌ఎస్ సభ్యులు అసెంబ్లీలో సైతం ప్రస్తావించారని, అయినప్పటికీ సర్కార్ నుంచి స్పందన లేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉన్న రూ.5 లక్షల ప్రమాద బీమా ఉండేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్నీ రద్దు చేసిందని నిప్పులు చెరిగారు.
అటకెక్కిన హామీలు..
తెలంగాణలో ఇప్పుడు ‘అహా.. నా పెళ్లం ట’ సినిమా నడుస్తున్నదని, ఆ సినిమాలో సన్నివేశంలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తామని చెప్పి, సర్కారు ఇప్పుడు మహిళల మెడలోని గొలుసులనూ లాక్కొంటుందని విమర్శించారు. ప్రతి మహిళకు నె లకు రూ.2,500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిందని, అలా ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.60 వేల చొప్పున బాకీ పడిందని వివరించారు.
అబద్ధాల ప్రభుత్వానికి ఇక బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చేసిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు కాంగ్రెస్ కు సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు తీసుకునే ఒక మంచి నిర్ణయం.. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.
ఉప ఎన్నికలో డబ్బులు కుమ్మరిం చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నదని, కావాలనే కారును పోలిన గుర్తులను కొంద రు అభ్యర్థులకు కేటాయించేలా చేసి, ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నదని ఆరోపించా రు. ఈవీఎంపై కారు గుర్తు మూడోస్థానంలో ఉంటుందని, ఓటర్లు ఆ విషయాన్ని గుర్తెరిగి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
గురుకుల విద్యార్థులను పట్టించుకోండి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మం డలం వంగరలోని పీవీ రంగారావు గురుకులంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీవర్షిని ఇటీవల బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై సోమవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. విద్యార్థిని ఆత్మహత్య తనను కలచి వేసిందన్నారు. గడిచిన రెండేళ్లలో 100 మందికి పైగా గురుకుల విద్యార్థులు మరణించారని, విద్యార్థుల పట్ల ప్రభుత్వాని కి బాధ్యతలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి, గురుకులాల్లో చదువువుతున్న విద్యార్థుల బాగోగులను పట్టించు కోవాలని సూచించారు.