28-10-2025 01:33:15 AM
వంటగదులు, ఆట స్థలాలు, మరుగుదొడ్లు కరువు
* బాలలకు టాయిలెట్లు లేని స్కూళ్లు 4,286.. బాలికలకు టాయిలెట్లు లేనివి 1,658.. కిచెన్ షెడ్లే లేని పాఠశాలలు 8,045.. పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం ఉండ దు.. ఇలా విద్యుత్ సౌకర్యంలేని బడులు 424.. తాగేందుకు మంచినీరు లేని పాఠశాలలు 500.. మంచినీటి వసతి లేని బడులు 76 వరకు.. ఇదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ల దుస్థితి.
చదువుకుంటేనే తలరాతలు మారుతాయని తెలిసి కూడా.. ప్రభుత్వ స్కూళ్లలో వసతుల లేమిని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడులు 24 వేలకు పైగా ఉంటే, అందులో చదివే విద్యార్థులు దాదాపు 18 లక్షలే. ప్రైవేట్ బడులు 11వేలు ఉంటే.. అందులో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 35 లక్షలు.
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): అన్ని వసతులుంటేనే బడి అంటాం. కానీ రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో కనీస సౌకర్యాలైన కిచెన్ షెడ్లు, ఆట స్థలాలు, మరుగుదొడ్లు కూడా లేవు. తాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, పారిశుధ్య సౌకర్యాలు, ల్యాబ్‌లు, పక్కా భవనాలు కూడా కొన్ని పాఠశాలల్లో కరువయ్యాయి. ఈ కనీస వసతులు విద్యార్థుల అభ్యాసానికి, ఆరోగ్యానికి, వికాసానికి ఎంతో కీలకమైనవి. కానీ కొన్ని బడులు పేరుకే ఉంటున్నాయి.
అందులో కనీస అవసరాలు కూడా ఉండటంలేదు. రా ష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు అందుబాటులో లేవు. బాల బాలికలకు మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం వండేందుకు షె డ్లు, తాగునీరు, ప్రహరీలు, క్రీడా మైదానాలు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేని పాఠశాలలు వేలల్లోనే ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ తాజా నివేదికలో తేలింది.
తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేకపోవడంతో ఫీజులు ఎక్కువైనా ప్రైవేట్ పాఠశా లల్లోనే తమ పిల్లలను తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు. కనీస వసతులు లేని సర్కారు బడులకు పంపేందుకు వారు ఇష్టపడటంలేదు. ఫలితంగా ప్రభుత్వ బడుల్లో కంటే ప్రైవేట్ బడుల్లోనే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వ బడులు రాష్ట్ర వ్యాప్తంగా 24 వేలకు పైగా ఉంటే, అందులో చదివే విద్యార్థులు దాదాపు 18 లక్షలే. ప్రైవేట్ బడులు 11 వేలు ఉంటే అందులో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 35 లక్షలుగా ఉంది.
ప్రహరీలు కూడా లేవు
ప్రభుత్వ పాఠశాలలకు కనీసం ప్రహరీలు కూడా లేవు. పాఠశాలలకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో ఇటీవల గురుకుల విద్యాలయాల్లో ఒకట్రెండు చోట్ల విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. ప్రహరీలు ఉంటే పాములు, విషపురుగులు వచ్చే ఆస్కారం ఉంటుంది. పాఠశాల భూమి కూడా కబ్జాకు గురికాదు. విద్యార్థులు సైతం ఆ స్కూల్ ఆవరణలో ఆటలు ఆడుకునే అవకాశం ఉంటుం ది.
ప్రభుత్వం 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంటే, పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలకు మాత్రం విద్యుత్ సౌకర్యం లేదు. విద్యుత్ సౌకర్యం, తాగేందుకు మంచినీరులేని పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 500 ఉన్నాయి. వీటిలో విద్యుత్ సౌకర్యంలేని బడులు 424 కాగా, మంచినీటి వసతి లేని బడులు 76 వరకు ఉన్నాయి.
పాలకుల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం
పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రభు త్వ పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 24,244 పాఠశాలలుంటే అందులో ఆటస్థలాలు, మరుగుడొడ్లు లేనివి వేలల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి కలిగించాలని, అందుకు బడులే వేదికలు కావాలని సూచిస్తున్నది. కానీ రాష్ట్రంలో మైదానాలు ఉన్న పాఠశాలలు 19,584 ఉన్నాయి.
ఇంకా 4,660 పాఠశాలల్లో ఆటస్థలాలే లేవు. బాలలకు టాయిలెట్లు లేని స్కూళ్లు 4,286 ఉండగా, బాలికలకు టాయిలెట్లు లేనివి 1,658 ఉన్నాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండేందుకు కనీస వసతులు లేవు. 8,045 పాఠశాలల్లో కిచెన్ షెడ్లే లేవు. దీంతో స్కూల్ ఆవరణలో, చెట్టు కిందనో వంట వండుతు న్న పరిస్థితి ఉంది. దీంతో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగే అవకాశం లేకపోలేదు.