calender_icon.png 6 September, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకోవాలి

06-09-2025 05:19:13 PM

కరీంనగర్,(విజయక్రాంతి): నేటి బాలలను రేపటి భావి పౌరులుగా ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రం సమీపంలో కొత్తపల్లి స్వాగత్ ఫంక్షన్ హాలులో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. విద్యార్థులకు చదువుతోపాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, నైతిక విలువలు బోధించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి.. వారిలో ఆత్మవిశ్వాసం నింపి చదువుకునేలా చూడాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కాకుండా విద్యార్థుల ప్రవర్తనను నిరంతరం గమనించాలని సూచించారు. 

ప్రాథమిక పాఠశాలల టీచర్లు విద్యార్థులతో ప్రేమపూర్వకంగా మెలగాలన్నారు. మమ్మల్ని సంప్రదిస్తే ప్రభుత్వం తరఫున ప్రైవేటు పాఠశాలల టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (ఎస్ హెచ్వీ ఆర్) లో అన్ని పాఠశాలలు  పాల్గొనాలని సూచించారు. డీఇఓ చైతన్య జైనీ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులకు ప్రశంస పత్రం అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.