06-11-2025 07:49:32 PM
- ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి
- సిఐటియు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్
మంచిర్యాల, (విజయక్రాంతి) : ఆశాలకు రూ. 26 వేలు ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించి చెల్లించాలి సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ కోరారు. ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎస్.సమ్మక్క అధ్యక్షతన గురువారం మంచిర్యాల పట్టణంలో జరిగిన ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయు) మూడవ జిల్లా మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించకుండా శ్రమ దోపిడి గురి చేస్తుందనీ, కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. 20 ఏళ్లు దాటిన కూడా ఉద్యోగ భద్రత, పెన్షన్, ఇతర సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించడం లేదని, ఇతర సేవలు అన్ని ఆశా వర్కర్లతో చేయించుకుంటున్న ప్రభుత్వాలు గుర్తింపు మాత్రం ఇవ్వడం లేదన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలనీ, పెండింగ్లో ఉన్న పిఆర్సి డబ్బులను వెంటనే చెల్లించాలన్నారు. ఏఎన్సీ టార్గెట్ల పేరుతో ఆశ వర్కర్లను బెదిరించడం సరైనది కాదన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల డబ్బులు వెంటనే చెల్లించాలనీ, ప్రతి పీహెచ్సీలో ఆశా వర్కర్లకు కనిస సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతి ఆశ వర్కర్ కు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఇటీవల చనిపోయిన ఆశా వర్కర్లకు, ప్రజాసంఘాల నాయకులకు సంతాపం ప్రకటించారు. అనంతరం ఆశ వర్కర్ జిల్లా కార్యదర్శి ఎస్. శోభ ఈ మూడేళ్ల కాలంలో జరిగిన పోరాటాలను, నివేదికను చదివి వినిపించారు. ఈ మహాసభలో పట్టణ పౌర వేదిక కన్వీనర్ ప్రకాష్ , సీఐటీయూ జిల్లా నాయకులు దేవదాస్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గుమాసా అశోక్, జిల్లాలోని ఆశాలు పాల్గొన్నారు.
నూతన జిల్లా కమిటీ ఎన్నిక
మంచిర్యాల జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయు ) నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా సంకె రవి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎస్. శోభ, జిల్లా అధ్యక్షులుగా ఎస్. సమ్మక్క, జిల్లా కార్యదర్శిగా సరోజ, జిల్లా ఉపాధ్యక్షురాలుగా విజయలక్ష్మి, అరుంధతి, కవిత, జిల్లా కోశాధికారిగా పద్మ, జిల్లా సహాయ కార్యదర్శులుగా సునీత, సువర్ణ, ఉదయ, జిల్లా కమిటీ సభ్యులుగా అనురాధ, లక్ష్మి, భాగ్య, కవిత, రాజేశ్వరి, పుష్ప, లావణ్య, సుజాత, నీరజ, లీలలను ఎన్నుకున్నారు.