06-11-2025 07:46:35 PM
రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్
మరిపెడ (విజయక్రాంతి): డీఎస్ఎఫ్ఐ తీరుపై లంబాడీల ఐక్య వేదిక అభ్యంతరం జిల్లా ఉద్యోగ సంఘ నాయకుడు, మండల విద్యాధికారిగా ఉన్న ఒక అధికారిపై డీఎస్ఎఫ్ఐ (డి ఎస్ ఎఫ్ ఐ) నేతలు మరియు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు సామాజిక మాధ్యమాలలో చేస్తున్న ప్రచారాన్ని లంబాడీల ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ నవంబర్ 6న ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రచారం వెనుక 'వేరే విషయాలు' ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధంగా విద్యార్థి సంఘం పేరుతో లంబాడీ అధికారులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన బాధను వ్యక్తం చేశారు.
ఒక అధికారి తప్పు చేసి ఉంటే, ఫిర్యాదు చేయడానికి చట్టపరమైన మార్గాలు, ప్రభుత్వ యంత్రాంగం, శాఖపరమైన అధికారులు ఉన్నారని జాదవ్ రమేష్ నాయక్ పేర్కొన్నారు. వాటిని ఆశ్రయించకుండా, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడం తగదని హితవు పలికారు. ఇప్పటికే జాతి వ్యతిరేకులు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తుండగా, ఇప్పుడు డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వివేక్ కూడా అదే బాట పట్టడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు. వివేక్ అసలు విద్యార్థి నాయకుడు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు మినహా, మిగిలిన నాయకులు లంబాడీ వారేనన్న విషయాన్ని గమనించాలని రమేష్ నాయక్ అన్నారు.
"మా జాతి నాయకులను పావులుగా వాడి వివేక్ ఏమి ప్రయోజనాలు ఆశిస్తున్నది అర్ధం కావట్లేదు" అని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో, కొందరు డీఎస్ఎఫ్ఐ నేతలు గతంలో కిసాన్ పరివార్,డిఎస్ఎఫ్ఐ వంటి సంస్థల నుండి 'బహిష్కరించబడ్డారని' ఆయన ఆరోపించారు. ఈ నిరంతర సోషల్ మీడియా ప్రచారం సదరు అధికారిని 'తీవ్ర మానసిక ఒత్తిడికి' గురిచేస్తోందని, ఏవైనా 'అవాంఛనీయ పరిణామాలు' సంభవిస్తే, దానికి ప్రచారం చేస్తున్నవారే నైతికంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వివాదంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్య క్రమములో రాష్ట్ర కన్వీనర్ శంకర్ నాయక, జోనల్ ఇంచార్జీ భద్రు నాయక్ మరియు ఇతర రాష్ట్ర కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు.