ఇటలీ కాంగ్రెస్!

27-04-2024 02:26:54 AM

n ఆ దేశ వ్యక్తిని మన దేశ ప్రధానిని చేయాలని ప్రయత్నించింది

n బీజేపీ వస్తే రిజర్వేషన్లుండవంటూ తప్పుడు ఆరోపణలు

n అసత్య ప్రచారాలతో దిగజారుడు రాజకీయం చేస్తోంది

n అంబేడ్కర్‌కు గౌరవం ఇచ్చింది కమలం పార్టీయే

n బీసీలకు అన్యాయం చేసింది హస్తం పార్టీ 

n బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ విధానాలు, వాడుతున్న భాషపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఆ పార్టీ పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని, ఇటలీ నేషనల్ కాంగ్రెస్‌గా మారిందని మండిపడ్డారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ నాయకులు వాడుతున్న భాష అత్యంత అభ్యంతరకరంగా ఉందని, వారు చేస్తున్న ప్రకటనలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

200 ఏళ్ల్లు బ్రిటిష్ వాళ్లు పాలించారని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ ప్రతినిధిగా ఇటలీకి చెందిన సోనియా గాంధీని దేశానికి ప్రధానిని చేయాలని ప్రయత్నించిందని అన్నారు. నాడు బీజేపీ అడ్డుకోకపోతే ఇటలీకి చెందిన వ్యక్తిని దేశానికి ప్రధానిగా చూసేవాళ్లమని, అందుకు కాంగ్రెస్ ఏ విధంగా ప్రయత్నించిందో ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. సోనియాను ప్రధాని కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని బీజేపీ హెచ్చరించడంతోనే మన్మోహన్ సింగ్‌ను రిమోట్ కంట్రోలర్ ప్రధానిగా కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. అలాంటి పార్టీకి బీజేపీని విమర్శించే స్థాయి లేదన్నారు.

కాంగ్రెస్ వల్లే అవినీతి, పేదరికం..

దేశంలో సమస్యలన్నింటికీ కారణం కాంగ్రెస్ పార్టీనేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం, అవినీతి, పేదరికం, మాఫియా రాజ్యాలు, కుటుంబ పాలనలో దేశం మగ్గిపోవడానికి సహా అనేక సమస్యలకు కారణం కాంగ్రెస్ చేసిన తప్పిదాలేనని అన్నారు. దేశానికి పట్టిన దరిద్రాన్ని పదేళ్ల క్రితం ప్రజలు వదిలించుకున్నారని, మరోసారి ఆ పార్టీని దరిచేరనివ్వవద్దని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మతిభ్రమించినవారు, కనీస పరిజ్ఞానం లేని వారే ఆ విధంగా మాట్లాడతారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దేశం కోసం పుట్టిందని, పార్టీ నాయకులమైన తామంతా భారత్ కోసం చావడానికీ సిద్ధమన్నారు.

దేశంలో ముస్లిం రిజర్వేషన్లను కాంగ్రెస్ హయాంలోనే ఎలా పెంచారని ప్రశ్నించారు. ప్రస్తుత కాంగ్రెస్ జిన్నా కాంగ్రెస్‌గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆ పార్టీ పుణ్యమా అని కశ్మీర్‌లో 73 ఏళ్లు జిన్నా రాజ్యాంగం అమలు అయ్యిందన్నారు. ఆర్టికల్ 370 కారణంగా 42 వేల మందిని పొట్టన పెట్టుకున్న పాపం కాంగ్రెస్‌దేనన్నారు. 73 ఏళ్ల పాటు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవహేళన చేసిందన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే సైతిక హక్కే లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కుట్రతో బీజేపీపై బురద జల్లే పనిపెట్టుకున్నదని కాంగ్రెస్ పార్టీని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని అవమానపరిచిన కాంగ్రెస్‌ది పక్కా ఇటలీ పార్టీ అని... బీజేపీ పక్కా లోకల్ పార్టీ అని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కనుచూపు మేరలో కూడా అవకాశం లేదని... పొరపాటున వస్తే మాత్రం దేశాన్ని సర్వనాశనం చేస్తారని అన్నారు. ఇదంతా గమనించే ప్రజలు నరేంద్రమోదీ పాలన కోరుకుంటున్నారని తెలిపారు. 

బీసీలకూ అన్యాయం చేసింది.. 

దేశంలో, రాష్ట్రంలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని కిషన్‌రెడ్డి అన్నారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడం వల్ల వెనకబడినవర్గాలకు అన్యాయం జరుగుతుందా? లేదా? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. బీసీలకు ఉన్న 27శాతం రిజర్వేషన్లలో 8 శాతం మతపరమైన రిజర్వేషన్లకు కేటాయించాలని ప్రధానిగా మన్మోహన్‌సింగ్ సిఫారసు చేసిన మాట వాస్తవమా?కాదా? అని నిలదీశారు. ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసిన మాట వాస్తవమా? కాదా? అని అడిగారు. నిజంగా బీసీలకు న్యాయం చేయాలని ఉంటే రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను గౌరవించింది బీజేపీయేనని అన్నారు. లోక్‌సభలో బాబాసాహెబ్ చిత్రపటం పెట్టడానికి కారణం కూడా బీజేపీయేనన్నారు. ఆ మహనీయునికి భారతరత్న కూడా బీజేపీ వల్లే వచ్చిందన్నారు. అంబేడ్కర్‌కు సంబంధించిన 5 ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేసిన ఘనత కూడా బీజేపీకే దక్కుతుందన్నారు. దేశానికి ప్రధానిగా పనిచేసిన పీవీని కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు. కనీసం ఆయన అంత్యక్రియల కోసం దేశ రాజధానిలో స్థలం కూడా కేటాయించలేదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పీవీ సేవలను గుర్తించి ఆయనను భారతరత్నతో గౌరవించిందన్నారు. 

రిజర్వేషన్ల రద్దు అంటూ బీజేపీపై తప్పుడు ప్రచారం...

దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. పదేళ్లలో ఎక్కడైనా రిజర్వేషన్లను ఎత్తేసిందా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈబీసీ రిజర్వేషన్లను తీసుకువచ్చిన ఘనత బీజేపీదేనని గుర్తుచేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీట్లను కేటాయించినట్లు తెలిపారు. ఈబీసీలో ఉన్న నిరుపేదలకు రిజర్వేషన్ కల్పించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లోని 13 హామీల సంగతి ఏమైందని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతావేవీ అమలు కాలేదన్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని అన్నారని, మళ్లీ ఆగస్టు 15కు వాయిదా వేశారని.. రైతులకు ఏం సమాధానం చెబుతారని కాంగ్రెస్ నాయకులను ఆయన నిలదీశారు. బీజేపీపై చార్జ్‌షీట్ అంటున్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీ ఇచ్చి మాట తప్పినందుకు వారిపైనే చార్జ్‌షీట్ వెయ్యాలని మండిపడ్డారు.