27-11-2025 04:45:37 PM
- డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులతో ఇళ్ల ముట్టడి ఖాయం
- మా నాయకుడిని విమర్శించే స్థాయి మీది కాదు
- అభివృద్ధిపై మాట్లాడాల్సిన వ్యక్తిని జర్మనీ పంపించాడు
- రాత్రుల్లో మా నాయకుడితో మాట్లాడి.. పగలు విమర్శిస్తున్నారు
- కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు పూర్తిగా సైలెంట్ అయిపోయారని, కానీ పట్టణ భారాస పార్టీ నేతలు మాత్రం ఎందుకు వైలెంట్ అవుతున్నారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. వేములవాడ పట్టణం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొంతమంది చోటామోటా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆది శ్రీనివాస్‌ను విమర్శిస్తున్నారని, అయితే తమ నాయకుడిని విమర్శించే స్థాయి కాదని. నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడాల్సిన ప్రధాన వ్యక్తిని శాశ్వతంగా జర్మనీ పంపించారని, వందలాది కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి.పనులు చూసి ముఖ్య నేతలైన కెసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, చల్మెడ లక్ష్మీనరసింహారావు సైతం సైలెంట్ అయ్యారని వివరించారు.
డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణాలపై ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తే, త్వరలోనే 144 మంది లబ్ధిదారులతో ఇళ్లను ముట్టడిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాక, కొంతమంది పక్క పార్టీ నేతలు రాత్రుల్లో తమ నాయకుడితో మాట్లాడి తమ పనులు చేయించుకుంటూ, మళ్లీ పగలు అభివృద్ధి పనులను విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి నాయకులను ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారని, మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. రాబోయే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమురయ్య, ఖమ్మం గణేష్, వస్తాది కృష్ణ, పుల్కం రాజు, పులి రాంబాబు గౌడ్, బింగి మహేష్, ఇప్పప్పుల అజయ్, తదితర పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.