22-11-2025 10:18:08 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ శాస్త్ర విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ డా. జి.బి. రెడ్డి పర్యవేక్షణలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ అండర్ సెవెంత్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్-ఏ క్రిటికల్ స్టడీఅనే అంశంపై విశ్లేషణాత్మక పరిశోధనకు గాను ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ శాస్త్ర విభాగంలో గుండగాని కిరణ్ గౌడ్ కి డాక్టరేట్ ని ప్రధానం చేసింది.
సామాజిక, విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూనే ఉన్నత విద్యలో ప్రతిభను చూపిన కిరణ్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఐక్య విద్యార్థి సంఘాల వ్యవస్థాపక సభ్యుడిగా, టి.ఎస్.-ఓయూ జె.ఎ.సి.కి కన్వీనర్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ విద్యార్ధి విభాగం(టీఎన్ఎస్ఎఫ్) కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ యూనివర్సిటీలతో పాటు ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఇంచార్జిగా, తెలంగాణ బి.సి. ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం(బి.ఆర్.ఎస్.వి) రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా కొనసాగుతూ అనేక సామాజిక ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషించిన కిరణ్ గౌడ్ పై తెలంగాణ ఉద్యమ సమయంలో 100కి పైగా కేసులు ఎదుర్కొన్నాడు స్వస్థలం సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలంలోని గానుగుబండ గ్రామం, తల్లి తండ్రులు దుర్గయ్య- సుశీలకు రెండవ సంతానం.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబ నుంచి వచ్చిన కిరణ్ గౌడ్ దశాబ్ధంన్నరకుపైగా విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
న్యాయ శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా కిరణ్ గౌడ్ మాట్లాడుతూ పి హెచ్.డి అంటే కేవలం అత్యున్నత డిగ్రీనే కాదు అది ఒక వ్యక్తి యొక్క పరిశోధన సామర్ధ్యానికి, అంకితభావానికి, జ్ఞానానికి చేసే మౌలికమైన సహకారానికి నిదర్శనమని, భారత రాజ్యాంగంలోని ఏకీకృత చట్టపరమైన శక్తి పంపిణీ వ్యవస్థ, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, రాజ్యాంగిక సమతౌల్యంపై సవివర విశ్లేషణ చేశానని తన పరిశోధన భారత శాసన వ్యవస్థలో సమతౌల్య, పారదర్శకత, సమాఖ్య విలువలను బలపరచడంపైనే కేంద్రీకృతమైంది. ఇకపై కూడా న్యాయరంగ అభివృద్ధికి సేవలందించడం తన లక్ష్యం" అని తెలిపారు.
ఈ పరిశోధన ప్రయోజనం దేశంలోని శాసనాధికార పంపిణీ, రాజ్యాంగిక వివాదాలు, అధికార పరిధి, సమాఖ్య వ్యవస్థ బలపరచడంలో పాలసీ రూపకల్పనకు ఉపయోగపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిశోధనలో విలువైన సలహాలు,సూచనలు ఇస్తూ మార్గదర్శకం చేసిన తన గురువర్యులు ప్రో. జి.బి.రెడ్డితో పాటు తన పరిశోధనకు సంపూర్ణ సహకారం అందించిన న్యాయ కళాశాల అధ్యాపకులకి, సిబ్బందికి, ధన్యవాదాలు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన కిరణ్ గౌడ్ ని యూనివర్సిటీ అధ్యాపకులు, రాజకీయరంగ ప్రముఖులు, విద్యార్థి సంఘాల నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.