22-11-2025 10:11:15 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామ పరిధిలో మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ అనుమానాస్పద పరిస్థితుల్లో కూలిపోయిన ఘటనపై శనివారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మానేరు నదిపై మొత్తం 23 చెక్ డ్యాంలు నిర్మించిందని, వాటిలో గుంపుల–శమ్మునిపల్లె గ్రామాల మధ్య నిర్మించిన ఈ చెక్ డ్యామ్ చుట్టుపక్కల గ్రామాల వేలాది మంది రైతులకు ఆశాధారంగా నిలిచిందని పేర్కొన్నారు. కాని కొంతమంది స్వార్థపరులు, ఇసుక మాఫియా ప్రయోజనాల కోసం దురుద్దేశపూర్వకంగా చెక్ డ్యామ్‌ను పేల్చివేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచమైన పనికి పాల్పడిన వారిని ప్రభుత్వం వెంటనే గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.