calender_icon.png 28 November, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2015 గ్రూప్- 2 ర్యాంకర్లకు ఊరట!

28-11-2025 12:12:07 AM

  1. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు
  2. ఎంపికైన అభ్యర్థుల జాబితాను గతంలో రద్దు చేసిన సింగిల్ బెంచ్
  3. తాజాగా సీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, నవంబర్ 27 : తెలంగాణ గ్రూప్- 2 పరీక్షల (2015) వివాదంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) అపరేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మ ధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదే స మయంలో కేసువిచారణను ఆరువారాలపాటు వాయిదా వేసింది. ఈ తీర్పుతో గ్రూప్--2 ర్యాంకర్లకు ఊరట లభించింది. 

తొమ్మిది రోజుల క్రితం..

పదేళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన గ్రూప్-2 నియామకాలను రద్దు చేస్తూ తొమ్మిది రోజుల క్రితం హైకోర్టు సింగిల్ బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. ఓఎంఆర్  షీట్‌లో సమాధానాలు గుర్తించే పార్ట్-బీలో ట్యాంపరింగ్ చేసిన వారిని కూడా ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేస్తారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( టీజీపీఎస్సీ)ను ప్రశ్నించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారంటూ కమిషన్‌ను తప్పుబట్టింది.

డబుల్ జంబ్లింగ్, వైట్‌నర్, ఎరైజర్ వినియోగించిన పత్రాల మూల్యాంకనం చెల్లదని స్పష్టం చేసింది. 2019లో వెల్లడించిన ఫలితాలు చట్ట విరుద్ధమని పేర్కొంది. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం, సాంకేతిక కమిటీ సిఫార్సులను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఈ ప్రకియ అంతా ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. అయితే, ఇప్పుడు ఆ తీర్పును హైకోర్టు డివిజనల్ బెంచ్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. 

అసలు ఏం జరిగిందంటే..

గ్రూప్-2 కింద 1,032 పోస్టు భర్తీకి టీజీపీఎస్సీ 2015లో నోటిఫికేషన్ జారీ చేసింది. తర్వాత 2016లో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయగా అదే ఏడాది నవంబర్‌లో పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నపత్రం బుక్లెట్, ఓఎంఆర్  షీట్లకు పొంతన లేవన్న ఆరోపణలు రావడవంతో ప్రభుత్వం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. బుక్లెట్ నంబర్, ఓఎంఆర్ నంబర్ ఒకటే ఉండాలని అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు భావించడంతో ఈ గందరగోళం తలెత్తిందని కమిటీ 2017లో నివేదిక సమర్పించింది.

పార్ట్-బీలో జవాబులకు ట్యాంపరింగ్, వైట్‌నర్ వాడితే ఆ పేపర్లను మూల్యాంకనం చేయవద్దని సిఫారసు చేసింది. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం.. గ్రూప్- 2లో ఎంపికైన వారి జాబితాను రద్దు చేసిం ది. ఈ తీర్పుపై టీజీపీఎస్సీ మరోమారు హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం ఆ తీర్పును తాజాగా రద్దు చేసింది.