06-10-2025 12:24:04 AM
-ఆ పార్టీ మోసాలు చెప్పేందుకే ‘బాకీ కార్డు’
-ముస్లింలను తీవ్రంగా మోసం చేసింది
-22 నెలలైనా ఒక్క హామీ నెరవేర్చలేదు
-మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి) : రాష్ర్ట ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో చెప్పేందుకే ఇం టింటికి బాకీ కార్డు అందిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను పంచి 22 నెలలైనా ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికీ బాకీ కార్డు పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు.
ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా ప్రజలు అడగడం లేదని అనుకుం టున్నారని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపు నిచ్చారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడి తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం పడిపోదని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నా, ప్రతి మహిళకు 2,500 రావాలన్నా, ప్రతి వృద్ధులకు నాలుగు వేలు రావాలన్నా, యువతకు రెండు లక్షల ఉద్యోగాలు రావాలన్నా, కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు సూచించారు.
హామీ ల పేరిట మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. డబ్బుకో, మద్యం సీసాలకో అమ్ముడుపోవద్దని, రేవం త్ రెడ్డి ఇచ్చే డబ్బులు మీ ఎడమకాలితో తన్ని బీఆర్‌ఎస్‌ని గెలిపించాలని కోరారు. గోపీనాథ్ లాగానే బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత కూడా పేదల పక్షాన ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను తీవ్రంగా మోసం చేసిందని, షాదీ ముబారక్‌తో పాటు తులం బంగారం ఇవ్వలేదన్నారు. కొడంగల్‌లో మసీద్ దర్గాను కూల్చివేసిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీలకు రూ. నాలుగువేల కోట్లు బడ్జెట్ పెడతామని, కనీసం ఒక వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేదని, కానీ బీఆర్‌ఎస్ మైనార్టీని హోం మంత్రిని చేసిందని గుర్తు చేశారు. దేశం అబ్బురపడే విధంగా 203 మైనార్టీ స్కూళ్లను కేసీఆర్ ప్రారంభించారని చెప్పారు. ఇమామ్ మౌజములకు జీతం పెంచుతామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లింలు బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.