calender_icon.png 13 December, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2వ విడత ఎన్నికలకు సర్వం సిద్ధం..

13-12-2025 08:55:31 PM

* పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సిబ్బంది..

* డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

* 962 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్న ఎస్పీ..

* ఫలితాలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల్లో ఆసక్తి..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. శనివారం మండలాల వారీగా ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల అధికారులు, సిబ్బంది సామాగ్రిని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించగా, అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలను ప్రకటించనున్నారు. ఇన్నాళ్లు ప్రచారం నిర్వహించగా.. చివరికి గ్రామస్తులు ఎవరిని అందలం ఎక్కిస్తారో.. ఎవరిని ఒడిస్తారో నని పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

139 పంచాయతీల్లో ఎన్నికలు... 

ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడతలో 8 మండలాల్లో మొత్తం 156 పంచాయతీలు,  1,252 వార్డులు ఉండగా, ఇప్పటికే 17 పంచాయతీ లకు సర్పంచ్ లకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మిగతా 139 పంచాయతీ లకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఆదివారం ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. శనివారం ఎన్నికల అధికారులు, సిబ్బంది పంపిణీ కేంద్రం నుంచి సామాగ్రి తీసుకొని ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు.

తొలి విడతలో ప్రశాంతంగా ఎన్నికలు జరగగా.. రెండో విడతలోనూ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మరోవైపు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 2వ విడతలో 962 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. 

ఫలితాలపై ఉత్కంఠ..

రెండో విడత ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఇప్పటికే మొదటి విడతలో ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక పంచాయతీ స్థానాలు కైవసం చేసుకోగా.. ఆ తరవాత స్థానంలో బీఆర్ఎస్ గెలుచుకోంది. మూడో స్థానంలో బీజేపీ నిలిచింది. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగానే గెలుపొందారు. తాజా ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఆయా పార్టీల కీలక నాయకులు గ్రామాల్లో ఇప్పటికే ప్రచారం నిర్వహించగా.. పోలింగ్ సమయం దగ్గర పడిన కొద్ధి ముఖ్య నాయకులకు ఫోన్ లు చేస్తూ అలర్ట్ చేస్తున్నారు. మరోపక్క గ్రామాల్లో కీలకమైన వారికి ఫోన్ లు చేస్తూ తమ అభ్యర్థికి మద్దతు తెలుపాలని కోరుతున్నారు. ఆదివారం సాయంత్రం వరకు పోటీలో ఉన్న అభ్యర్థుల, రాజకీయ పార్టీల భవితవ్యం తెలిపోనుంది.