13-12-2025 08:35:12 PM
- సమస్యల పరిష్కారానికి పెద్దపేట
- మౌళిక వసతుల కల్పనే ధ్యేయం
- సుజాతనగర్ మండలంలో కూనంనేని విస్తృత పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): ప్రజలకు అండగా ఉండేది కమ్యూనిస్టులే అని, గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా మండలంలో సిపిఐ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికలను పురస్కరించుకుని శనివారం సుజాతనగర్ మండలంలోని జామ్లా తండా, బేతంపూడి తండా, కోయగూడెం, కొత్త అంజనాపురం, పాత అంజనాపురం, సింగభూపాలెం, రాఘవాపురం, మాలబంజర, సేతంపేట బంజర, సీతంపేట, గరీబపేట గ్రామ పంచాయితీల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ పేదలు, రైతులు, రైతు కూలీలతో పాటు అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు కమ్యూనిస్టు పార్టీయే అండని చెప్పారు.
ఆపద, దౌర్జన్యం, దోపిడీ, పెత్తందారీ విధానం ఉన్న చోట కమ్యూనిస్టులు వాటిపై పోరాటాలు సాగిస్తూ ప్రజలకు మేలు చేస్తారని చెప్పారు. అలాంటి కమ్యూనిస్టులను గెలిపించుకోవడం ద్వారా గ్రామాల్లోని సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని తెలిపారు. ఈ దిశగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకుపోయిందేకు ముందునుండీ పాటు పడుతూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రతీ కాలనీలో మౌళిక సదుపాయాల కల్పనకు పాటుపడుతున్నామని చెప్పారు. అనునిత్యం ప్రజలను వెన్నంటి ఉండి వారి కష్టాలు, సమస్యలపై స్పందించేది కమ్యూనిస్టు పార్టీ ప్రజాప్రతినిధులే అని ఈనెల 17న జరగనున్న గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సిపిఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఓట్ల కోసం అనేక రకాల ప్రలోబాలకు గురిచేసే వారు డబ్బు మూటలతో వస్తుంటారని, అలాంటి గుంటనక్కల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారి ఆగడాలను అడ్డుకునేందుకు అంతా ఒక కంట కనిపెట్టాలని సూచించారు. అనంతరం నాయకులు గూడెం వద్ద సిపిఐ సీనియర్ నాయకులు తెలంగాణ సాయిధ పోరాట సమరయోధుడు కొమారి రామయ్య ఐదో వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అరుణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భూక్యా దస్రు, మండల కార్యదర్శి కొమారి హన్మంతరావు, జిల్లా కార్యవర్గసభ్యులు జక్కుల రాములు, తాళ్ల వెంకటేశ్వర్లు, తాళ్లూరి పాపారావు, తాళ్లూరి ధర్మారావు, మండల నాయకులు మూడు గణేష్, వీర్ల మల్లేష్, దుర్గా ప్రసాద్, బొడ్డు శేశవరావు, గడ్డం రాజేందర్, బానోతు అనీల్, భాగం కృష్ణ, లావుడియా గోపి, భూక్యా శ్రీను, బండి రమేష్, దొడ్డ వెంకన్న, మిత్రపక్షాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.