13-12-2025 08:31:49 PM
కమలాపూర్ బిడ్డల తీర్పుతో ఘన విజయం..
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్..
హనుమకొండ (విజయక్రాంతి): తన సొంతూరులో తాను సూచించిన సర్పంచిని ఓడించేందుకు ఎన్నో కుట్రలు జరిగినా, కమలాపూర్ ప్రజలు వాటన్నింటినీ తిప్పికొట్టి భారీ మెజార్టీతో గెలిపించారని మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా గెలుపొందిన వారిని ఈటెల రాజేందర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో ఐదు గ్రామాల్లో బీజేపీ మద్దతు ఉన్న సర్పంచులను గెలిపించామని తెలిపారు.
స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రజలకు నాయకుడితో ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన సర్పంచులను రూ.5 నుంచి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పి పార్టీలోకి లాక్కోవడానికి చిల్లర ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 50 శాతం స్థానాలు గెలుచుకుందని ప్రచారం చేస్తున్నారని అయితే స్థానిక ఎన్నికలకు పార్టీ గుర్తులే ఉండవని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న పార్టీ పనులు చేస్తుందన్న భావనతో ప్రజలు తాత్కాలికంగా ఆకర్షితులవుతారని అన్నారు.
ముఖ్యమంత్రి ఈవెంట్ మేనేజర్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు. సింగరేణిలో క్వార్టర్లీ మరమ్మతులకు నిధులు లేవని కానీ అదే నిధులతో అవసరం లేని ఫుట్‌బాల్ కోర్టులు నిర్మిస్తున్నారని విమర్శించారు. కొత్తగా మంజూరైన పెన్షన్లు కూడా పూర్తిస్థాయిలో అందడం లేదని, గ్యాస్ సబ్సిడీ ఎక్కడా సక్రమంగా జమ కావడం లేదన్నారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు రైతుబంధు రుణమాఫీ వంటి పథకాలు పూర్తిస్థాయిలో అమలవడం లేదని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసిందని కేఆర్‌సీ కుమార్తెనే చెబుతుంటే ఇప్పుడు ఒకరినొకరు దూషించుకుంటున్నారని విమర్శించారు. వేల కోట్ల విలువైన భూమి ఒక వ్యాపారి చేతిలోకి వెళ్లిందని ఆరోపించారు.
గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందని ఇలాంటి సమయంలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. డబ్బులు దావతలు కాదు అని క్యారెక్టర్ ముఖ్యమని స్పష్టం చేశారు. రాబోయే రెండు మూడు దశల ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రజలు నిలవాలని పిలుపునిచ్చారు. కమలాపూర్‌లో తనను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా, కమలాపూర్ బిడ్డలు తనను గొప్ప మెజార్టీతో గెలిపించారని ఈటెల భావోద్వేగంగా చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని స్థానాలు గెలుచుకుంటామని రేపు జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే గెలుపు పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్‌బాబు, సర్పంచులు పబ్బు సతీష్, కొత్తపెళ్లి రాజు, బండి వనజ కళాధర్, బుర్ర రాధిక–కరుణాకర్, మేకల సుగుణ–రవి, నాయకులు కొండమీద రవీందర్, మౌటం సంపత్, పబ్బు సాంబయ్య, అశోక్, మొగిలి, సతీష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.