calender_icon.png 28 November, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్

28-11-2025 12:00:00 AM

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్  

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తమ ద్వంద నీతిని అమలు చేస్తూ తడిగుడ్డతో బీసీల గొంతు కోసిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో జీవో 46 తీసుకొచ్చి బీసీలను దగా చేసిందన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి.. చివరకు చేతులెత్తేసి భస్మాసుర హస్తంగా మారిందన్నారు.

గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 42 శాతం ఇస్తామన్న కాంగ్రెస్ కనీసం 17 శాతం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కుల గణన సర్వేలు, కోటా కోసం నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు, ఆర్డినెన్స్‌లు, జీవోలకు రూ. 200 కోట్ల వరకు ఖర్చుతో హడావుడితో బీసీలకు ఆశలు రేకెత్తించిన కాంగ్రెస్ చివరకు వెన్నుపోటు పోడిచిందని లక్ష్మణ్ ఆరోపించారు.

మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నందునే రాహుల్‌గాంధీ సూచన మేరకు సీఎం రేవంత్‌రెడ్డి కూడా తెలంగాణలో హడావుడి చేశారని లక్ష్మణ్ తెలిపారు. నెహ్రు కుటుంబం నుంచి ఇప్పటీ వరకు బీసీలను అడుగడుగునా కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బురిడీ కొట్టించిన కాంగ్రెస్, రాజ్యాంగ మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆంక్షలు, అమల్లో ఉన్న చట్టాలన్ని పరిగణలోకి తీసుకోకుండానే అలవికాని హామీలను ఇచ్చిందన్నారు.

కేంద్రం నుంచి వచ్చే నిధులు రూ. 2,300 కోట్ల కోసమే పంచాయతీ ఎన్నికలకు సిద్దమయ్యారని లక్ష్మణ్ ఆరోపించారు. ఎన్టీ రామారావు హయాంలో అంటే 1988లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటే ఇప్పుడు వాటిని కేవలం 17 శాతానికి తగ్గించారని తెలిపారు. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం ఎవరిని మభ్యపెట్టడానికని ఆయన నిలదీశారు.

రాష్ట్రంలో 12,733 గ్రామాలుండగా, 2019లో బీసీలకు 2,404 ( 23 శాతం ) 2025లో కేవలం 2176 ( 17 శాతం )  గ్రామాలకు బీసీలకు రిజర్వు చేశారని తెలిపారు. ములుగు, మహబూబాబాద్‌లో 3 శాతం, ఆదిలాబాద్ -4, ఆసిపాబాద -5, మంచిర్యాల -7, ఖమ్మం -9, వికారాబాద్ -10 కామారెడ్డి-23 శాతం రిజర్వేషన్లు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెంలో జీరో రిజర్వేషన్ అని తెలిపారు. బీహర్‌లో బీసీ సీఎం, ఈబీసీ డిప్యూటీ సీఎంను బీజేపీ చేసిందని, అనేక రాష్ట్రాల్లో బీజేపీ బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించిందని తెలిపారు.

ఎంత జనాభా ఉంటే అంత వాటా అంటున్న కాంగ్రెస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బీసీలను అడుగడుగునా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టడం ఖాయమని హెచ్చరించారు.