28-11-2025 12:00:00 AM
అదనపు ఎస్పీ మహేందర్
మెదక్ టౌన్, నవంబర్ 27 :మెదక్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారం బాల్యవివాహాల నిర్మూలనకు సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్యవివాహాలు సమాజ అభివృద్ధికి ఆటంకం కలిగించే ముఖ్య సమస్యగా గుర్తించిన నేపథ్యంలో, విద్యార్థినుల్లో చట్టపరమైన అవగాహన, స్వీయ రక్షణ, బాలల హక్కులపై అవగాహనా కల్పించడం కొరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ బాలికల విద్య సామాజిక పురోగతికి పునాది అని, విద్య అమ్మాయిలకు శక్తి, ధైర్యం, సొంత నిర్ణయాలు తీసుకునే ఆత్మవిశ్వాసం కల్పిస్తుందని తెలిపారు. బాల్యవివాహం అమ్మాయిల జీవితాన్ని, విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం వంటి అనేక విషయాల్లో వెనక్కు నెట్టే ప్రమాదకరమైన చట్ట వ్యతిరేక చర్య అన్నారు.
అలాగే 18 సంవత్సరాల లోపు అమ్మాయిలకు వివాహం చేయడం బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం శిక్షార్హ నేరమని గుర్తు చేస్తూ, తల్లిదండ్రులు, బంధువులు, గ్రామ పెద్దలు లేదా ఇతరులు ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఈవో విజయ డీడబ్ల్యూవో హేమ భార్గవి, ఎస్.ఐ సుచిత, డీసీపీవో నాగరాజు, కళాశాల ప్రిన్సిపాల్ యతిరాజవల్లి, విజన్ స్వచ్ఛంద సంస్థ ఈడీ కైలాస్, జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్ కె.రాజు, సఖి సిఏ రేణుక, న్యాయవాది నాగరాజు, స్వచ్ఛంద సంస్థ కమ్యూనిటీ మొబిలైజర్ యాదగిరి, నవనీత, సంజీవ్ పాల్గొన్నారు.