29-11-2025 12:00:00 AM
- జిల్లా ఆదాయాన్ని కొల్లగొట్టే కుట్ర చేస్తున్నారు
- జీహెఎంసీలో మున్సిపాలిటీల విలీనం అన్యాయం
- విలీనంతో శివారు ప్రాంతాలు వెనుబడే అవకాశం
- ఐక్యపోరాటాలతో జిల్లాను రక్షించుకుంటాం: కిషన్ రెడ్డి
తుర్కయంజాల్, నవంబర్ 28: రంగారెడ్డి జిల్లా ఉనికిని దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర పన్నిందని, జీహెఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనాన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తుర్కయంజాల్, ఆదిభట్ల, పెద్ద అంబర్‌పేట వంటి నియోజకవర్గాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయని, అలాంటి ప్రాంతాలను జీహెఎంసీలో కలపడం అన్యాయమన్నారు కిషన్‌రెడ్డి. దీనిపై వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని అఖిలపక్ష నాయకులతో కలిసి ఆందోళనకు శ్రీకారం చుడతామన్నారు.
జీహెఎంసీలో శివారు ప్రాంతాల మున్సిపాలిటీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తుర్కయంజాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని సంపదను కొల్లగొట్టడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ పావులు కదుపుతున్నారని ఆరోపించారు. జీడీపీలో దేశంలోనే టాప్‌గా ఉన్న రంగారెడ్డి జిల్లాలోని ఆదాయాన్ని జీహెఎంసీకి ఇవ్వడం దారుణమని అన్నారు. ఇక్కడి ఆదాయాన్ని తీసుకెళ్లి సిటీ నడిమధ్యలో అభివృద్ది చేస్తారని, శివారు ప్రాంతాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు కిషన్ రెడ్డి. బీఆర్‌ఎస్ హయాంలో రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి చేసేలా మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తే... ఇప్పుడు రేవంత్ సర్కార్ జిల్లా ఉనికినే దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
శివారు ప్రాంతాలను జీహెఎంసీలో కలిపితే... చివరకు ఈ జిల్లాకు మిగిలేది 20, 30 గ్రామాలేనని ఆందోళన వెలిబుచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలో జిల్లా అభివృద్ధి కోసం కేసీఆర్ పెద్ద కంపెనీలను తీసుకొస్తే... రేవంత్ మాత్రం ఫోర్త్ సిటీ పేరుతో ఫోర్ బ్రదర్స్ భారీ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారని ఆరోపించారు. మున్సిపాలిటీలను జీహెఎంసీలో విలీనం చేసి ప్రజలపై భారీ పన్నుల భారాన్ని మోపే ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు. జిల్లా ఉనికి, హక్కులు కాపాడేందుకు ఐక్య పోరాటాలకు శ్రీకారం చుడతామన్నారు.
కాంగ్రెస్సేతర పార్టీలతో కలిసి ప్రజా ఉద్యమం నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బొక్క గౌతమ్ రెడ్డి, చెవుల దశరథ, జొన్నాడ సుదర్శన్ రెడ్డి, కల్యాణ్ నాయక్, కొండ్రు మల్లేశ్, సంపతీశ్వర్ రెడ్డి, కొండ్రు శ్రీనివాస్, పల్లె గోపాల్ గౌడ్, ఏనుగు ఆనంద్ రెడ్డి, మేతరి అశోక్, చెవుల నరేందర్, బొడ్డు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.