20-10-2025 12:10:09 AM
అర్ధరాత్రి అరెస్టులేంటి?: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్‌లో దుకాణాలపై దాడులు చేసిన 9 మంది అరెస్ట్
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించాలనే డిమాండ్‌తో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన రాష్ర్టవ్యాప్త బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. కొన్ని ప్రాంతాల్లో బంద్ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పలు షాపులు, పెట్రోల్ బంకులు, చిరువ్యాపారుల దుకాణాలను బలవంతంగా మూసివేయించడమే కాకుండా, దాడులకు పాల్పడ్డారు.
దీంతో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో జరిగిన దాడుల నేపథ్యంలో కాచిగూడ పోలీసులు శనివారం అర్ధరాత్రి 9 మంది బీసీ సంఘాల నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య తీవ్రంగా స్పందించారు. దొంగలు, నక్సలైట్లను పట్టుకున్నట్లు అర్ధరాత్రి మా నాయకులను అరెస్ట్ చేస్తారా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇలా వ్యవహరించడం ప్రభుత్వ నిరంకు శత్వానికి నిదర్శనం అని మండిపడ్డారు.
బంద్‌లో జరిగిన చిన్న చిన్న ఘటనలను ఆసరాగా చేసుకుని, ప్రభుత్వం బీసీ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి జోక్యంతోనే ఈ అరెస్టులు జరిగాయని విమర్శించారు. అరెస్ట్ చేసిన నాయకులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.