calender_icon.png 27 July, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ శాఖపై కాంట్రాక్టర్ల గరం

26-07-2025 12:23:55 AM

-పైళ్ల కదలికల్లో అమ్యామ్యాలు,  ఓ ఉద్యోగిపై కాంట్రాక్టర్ల అసంతృప్తి

-ఉద్యోగి అవినీతిపై కరపత్రాల పంపిణీ, చర్చనీయాంశంగా మారిన వ్యవహారం

-పట్టించుకోని అధికార యంత్రాంగం

నల్లగొండ రూరల్, జూలై 25( విజయక్రాంతి) :  నల్లగొండ జిల్లా  విద్యుత్ శాఖను అవినీతి జాఢ్యం వీడడం లేదు. జిల్లా విద్యుత్ శాఖ పరిధిలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తున్నా.. చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎడతెగని నిర్లక్ష్యం వహిస్తుండడం గమనార్హం. నల్లగొండ డివిజన్ పరిధిలోని ఓ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి అమ్యామ్యాల కోసం కాంట్రాక్టర్లను వేధిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

కాంట్రాక్టర్లకు సంబంధించిన ఫైల్ మూవ్ చేసే విభాగంలో పనిచేసే సదరు ఉద్యోగి కాంట్రాక్టర్లను మాముళ్ల కోసం గత ఐదు నెలలుగా వేధిస్తున్నారంటూ డివిజన్ విద్యుత్ కాంట్రాక్టర్స్ పేరుతో అదే కార్యాలయంలో కరపత్రాలను గుట్టు చప్పుడు కాకుండా పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతకుముందే ఈ విషయాన్ని సదరు ఉద్యోగి పైఅధికారి దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం లేకపోవడం వల్లే.. ఈ లేఖ రాసి బహిర్గతం చేయాల్సి వచ్చిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

అసలు లేఖలో ఏముందంటే..

‘మేం అనగా నల్లగొండ డివిజన్ పరిధిలోని విద్యుత్ కాంట్రాక్టర్లం. మేం చాలా రోజుల నుంచి ఓ ఉద్యోగి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సదరు ఉద్యోగి జాయిన్ అయిన కొత్తలో మా నుండి ఏలాంటి డబ్బులు వసూలు చేయలేదు. కానీ గత ఐదు నెలల నుంచి డబ్బులు ఇవ్వనిదే పనిచేయడం లేదు. డబ్బులివ్వకుంటే పని చేసేదీ లేదని హుకూం జారీ చేస్తోంది. కనీసం ఈరోజు డబ్బుల్లేవ్.. రేపు ఇస్తామన్నా వినడం లేదు. అసలే స్టోర్లో పరికరాలన్నీ అందుబాటులో లేక మేం మా జేబులో నుంచి డబ్బులు పెట్టుకుని మరీ సామాగ్రి కొనుగోలు చేసి రైతులకు సేవలు అందిస్తున్నాం.

ఆఫీసులో జీతభత్యాలు తీసుకుంటూ ఇలా మమ్మల్ని వేధించడం ఎంతవరకు న్యాయం. ఇప్పటికైనా సదరు ఉద్యోగి మీద చర్యలు తీసుకోవాలని, లేకపోతే మేం వేరే దారి చూడాల్సి వస్తుందని’ లేఖలో పేర్కొన్నారు. నోట్ : ఈ విషయాన్ని మేం పేర్లతో సహా ఇవ్వగలము. కానీ పేర్లు ఇస్తే వారికి వర్క్ ఇవ్వకుండా, పని  చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తారనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లం అందరం కలిసి కూర్చొని ఇలా లేఖ ఇస్తున్నామని ఆ లేఖలో వివరించడం కొసమెరుపు.