21-09-2025 12:12:28 AM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలో ఈనెల 17 నుండి వచ్చే నెల 16 వరకు నిర్వహించబోయే “పోషణ మాసోత్సవాలు” విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం పోషణ మాసోత్సవాల నిర్వహణపై ఐడిఓసి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్ లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల అధికారులు, ఇతర సంబంధిత విభాగాల అధికారి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రణాల్ శ్రేష్ఠ కూడా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ... నెల రోజుల పాటు కొనసాగనున్న ఈ మాసోత్సవాల ప్రధాన లక్ష్యం గ్రామస్థాయిలో ప్రజల్లో పోషకాహారంపై అవగాహన సృష్టించడం, గర్భిణీ మహిళలు, బాలింతలు, చిన్నపిల్లలు తీసుకోవాల్సిన ఆహారానికి సంబంధించిన మార్గదర్శకత ఇవ్వడం, గ్రామస్థాయి ఆరోగ్య, పోషణ పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం అని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన సూచించిన ముఖ్య కార్యకలాపాలలో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు, ఎత్తు కొలవడం, తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, , బాలామృతం కిశోర బాలికలకు వైద్య పరీక్షలు, తల్లిపాల ప్రాధాన్యత, కిచెన్ గార్డెన్ ఏర్పాట్లు, పరిశుభ్రత పాటించడం, పోషకాహారాల ప్రదర్శనలు వంటి విభిన్న కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి గ్రామస్థాయిలో ప్రజల్లో పోషణ అవసరంపై అవగాహన పెంచి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా అధికారులు గ్రామాల వారీగా మాసోత్సవాల పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ చూపడం, ప్రతీ కార్యక్రమాన్ని సమగ్రంగా రికార్డ్ చేయడం, తగిన నివేదికలను ప్రభుత్వం కు సమర్పించడం ముఖ్యమన్నారు.
అనంతరం డిఆర్డిఏ ఆధ్వర్యంలో నిర్వహించు సురక్షత, పోషణ, సత్తా, మరియు ఆరోగ్యం (SNEHA – Safety, Nutrition, Empowerment, Health of Adolescents ) కార్యక్రమం పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ కార్యక్రమంలో భాగంగా 11 నుండి 14 సంవత్సరాల బాలికలు అపార్ కార్డుల నమోదు కార్యక్రమం. 15 నుండి 18 సంవత్సరాల గల బాలికలకు హై స్కూల్ , కళాశాలలో చేర్పించు కార్యక్రమాలు వారికి విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.