21-09-2025 12:08:43 AM
-ఏటా 300 సీట్లు కోల్పోతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు
-జీవో 550ని తుంగలో తొక్కి అన్యాయం
-ఎంపీ ఆర్ కృష్ణయ్య
-విద్యార్థులకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం భట్టికి విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలులో తీవ్ర అన్యాయం జరుగుతోందని, దీనివల్ల ఈ వర్గాల విద్యార్థులు ఏటా 200 నుంచి 300 సీట్లు కోల్పోతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా జారీ చేసిన జీవో 550ని ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టి, బడుగు బలహీన వర్గాల కు అన్యాయం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఈ అక్రమాలను తక్షణమే సరిది ద్దాలని కోరుతూ ఆయన నేతృత్వంలోని బీసీ సంఘాల నాయకులు శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. “ఓపెన్ కాంపిటీషన్‌లో మెరిట్ ద్వారా సీట్లు సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను కూడా రిజర్వేషన్ కోటా కింద చూపిస్తూ, ఆయా వర్గాలకు కేటాయించిన సీట్లలో కోత విధిస్తున్నారు. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం, అని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం సుప్రీంకోర్టు వరకు పోరాడి సాధించుకున్న జీవో 550ని గత 20 ఏళ్లుగా అమలు చేశారు. కానీ 2021 నుంచి కొత్తగా జీవో నెం. 114ను తెరపైకి తెచ్చి, కాలేజీ ఆప్షన్ పేరుతో వక్రభాష్యం చెబుతూ అన్యాయం చేస్తున్నారు” అని విమర్శించారు.
గత సంవత్సరం ఇదే విధానం వల్ల 262 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారని, ఈ ఏడాది కూడా అదే కుట్రను అధికారులు పునరావృతం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల దయనీయ పరిస్థితిని కూడా కృష్ణయ్య ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత 18 నెలలుగా ఎస్టీ హాస్టళ్లకు, 6 నెలలుగా ఎస్సీ, బీసీ హాస్టళ్లకు మెస్ బిల్లులు చెల్లించలేదు. 28 నెలలుగా అద్దె భవనాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లు సరుకులు నిలిపివేస్తామని, భవన యజమానులు ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ బిల్లులను విడుదల చేయాలి, అని ఆయన డిమాండ్ చేశారు.
వారం రోజుల్లో పరిష్కరిస్తాం: భట్టి
బీసీ సంఘాల నాయకుల విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. వారం రోజుల్లోగా హాస్టళ్ల మెస్, అద్దె బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఎంబీబీఎస్ కౌన్సెలింగ్లో రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న అక్రమాలను సరిదిద్దేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ చర్చలలో బీసీ సంఘం నాయకులు నీల వెంకటేష్, మణికంఠ, అనంతయ్య, రవి కుమార్ యాదవ్, అరవింద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.