రూ.104 కోట్ల నగదు సీజ్

29-04-2024 01:40:51 AM

మద్యం, ఆభరణాలు సైతం

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పార్లమెంటు ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఆదివారం చేసిన తనిఖీల్లో పలుచోట్ల మద్యం, నగదును పట్టుకుని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. స్థానిక ప్రజలు ఓట్ల కోసం మభ్యపెట్టే ప్రయత్నాలు రాజకీయ నేతలు పాల్పడితే తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సరిహద్దులో చెక్‌పోస్టుల పెట్టి అక్రమ రవాణా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.104.18 కోట్ల నగదు, రూ.5.38 కోట్ల విలువైన మద్యం, రూ.7.12 కోట్ల విలువైన మత్తు పదార్థాలు, ఆభరణాలు రూ.21.34 కోట్లు, ఇతర వస్తు సామగ్రి రూ.6.91 కోట్లు, లైసెన్స్ ఆయుధాలు 7,174తోపాటు 14 అనుమతి లేని ఆయుధాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. 

హైదరాబాద్‌లో.. 

హైదరాబాద్ నగరంలో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల్లో రూ. 1.53 కోట్ల నగదును స్వాధీ నం చేసుకున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఆదివారం తెలిపారు. నగదుతో పాటు రూ.77.52 లక్షల విలువైన ఇతర వస్తువులు, 23 లీటర్ల మద్యాన్ని స్వాధీ నం చేసుకున్నామని వెల్లడించారు. మొత్తం 11 ఫిర్యాదులు అందగా 6 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో మొత్తం రూ.19 కోట్ల నగదు, రూ.8.22 కోట్ల విలువల కలిగిన వస్తువులు, 21,422 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. మొత్తం 244 కేసులు నమోదు చేసి 242 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు 3,024 లైసెన్స్ కలిగిన ఆయుధాలు డిపాజిట్ అయినట్టు చెప్పారు.