25-11-2025 07:03:10 PM
రూ.3.40 కోట్లతో సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు.
రూ.3 కోట్లతో కొత్తపల్లి గోరి మండలంలో రహదారి బ్రిడ్జి ఏర్పాటు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..
రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేలా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేసినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రూ.3.40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన సిటీ స్కాన్ యంత్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన జిల్లాతో పాటు పొరుగున ఉన్న సిరోంచ ప్రాంతం నుండి కూడా ప్రజలు వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తున్నారని, ఏదేని ప్రమాదం జరిగితే ప్రజలు వైద్య సేవలకు సుదూర ప్రాంతాలకు సిటీ స్కాన్ సేవలకు వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు.
ఇప్పటి వరకు సిటీ స్కాన్ పరీక్షల కోసం ప్రజలు వరంగల్, హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం పూర్తిగా తీరిందన్నారు. జిల్లా ఆసుపత్రిలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఆసుపత్రిలో ఇప్పటికే వెంటిలేటర్లు, సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేశామని, త్వరలో ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రికి 203 పోస్టులు మంజూరు చేయించామని, అవసరమైన వైద్య సిబ్బంది నియామకానికి కూడా కృషి చేస్తున్నామన్నారు. గతంలో నెలకు 50 నుండి 100 వరకు మాత్రమే ప్రసవాలు జరిగేవని, నేడు అవి 800 వరకు పెరిగాయని తెలిపారు. అన్ని విభాగాల్లో ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని, ఇంకా అవసరమైన వైద్యుల నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
రూ.3 కోట్లతో రహదారి బ్రిడ్జి ప్రారంభం.
రేగొండ నుండి కొత్తపల్లి గోరి, ములుగు వెళ్లే రహదారిలో జగ్గయ్యపేట, కొత్తపల్లి గోరి మధ్యలో ఉన్నారు. 3 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో దానిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఉమ్మడి మండలాల ప్రజలు రాక పోకలకు ఇబ్బంది పడేవారని ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు రూ.3 కోట్లతో పునర్నిర్మాణం చేపట్టడం త్వరగా పనులు పూర్తి చేసి రహదారి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే ఉమ్మడి మండలంలో ఉన్న మిగతా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.