25-11-2025 07:01:50 PM
హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్, నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ, ఎన్నికల సంఘం ఏర్పాట్లను ఇప్పటికే చేసింది. తెలంగాణలోని 31 జిల్లాలోని 545 గ్రామీణ మండలాల్లోని, 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఇవాళ జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ... గ్రామ ఓటర్లు 1.66 కోట్ల మంది ఉన్నారని, సెప్టెంబర్ 29వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించామని, కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న షెడ్యూల్ పై తెలంగాణ హైకోర్టు స్టే విధించిందని ఎస్ఈసీ పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తామని, డిసెంబర్ 11 మొదటి విడత ఎన్నికలు, డిసెంబర్ 14 రెండో విడత ఎన్నికలు, డిసెంబర్ 17వ తేదీన మూడో విడత పోలింగ్ జరుగుతోందని, ఈనెల 27 నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానుందన్నారు. 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు తొలి దశ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. నవంబర్ 30 నుంచి రెండో విడత ఎన్నికలకు నామినేషన్లు, డిసెంబర్ 3వ తేదీ నుంచి మూడో విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్ఈసీ తెలిపారు. ఓటర్ల జాబితా సహా అన్ని వివరాలు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో ఉంటాయని ఆమె వివరించారు. ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు.
