calender_icon.png 17 November, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు ప్రారంభం

17-11-2025 08:14:34 PM

గద్వాల: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జిన్నింగ్ మిల్లుల యజమానులు వివిధ డిమాండ్లతో నిరసన వ్యక్తం చేస్తూ పత్తి కొనుగోలు బందు చేయడంతో, రైతులు ఇబ్బందులు పడకుండా సిసిఐ ఉన్నతాధికారులు, ప్రభుత్వ అనుమతితో గద్వాలలో కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు. సోమవారం సాయంత్రం గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి గద్వాల శివారులోని బాలాజీ జన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని వారు సందర్శించారు.

సోమవారం స్లాట్ బుక్ అయిన రైతులు ఉదయం నుంచే వాహనాల్లో పత్తిని అమ్మేందుకు కేంద్రానికి తీసుకురావడంతో వారికి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ సిసిఐ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఎకరానికి మొదటి రోజుకు 12 క్వింటాళ్లు పత్తి తీసుకోగా, ప్రస్తుతం 07 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేయడం, తేమ శాతం విషయంలో నిబంధనలు సడలించాలని కోరుతున్న నేపథ్యంలో విషయాన్ని ఇదివరకే వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రస్తుతానికి సిసిఐ నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాం... ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 

అకాల వర్షాల కారణంగా రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడంతో స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నతాధికారుల సహకారంతో మిల్లు యజమానితో మాట్లాడి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. ఎకరాకు 12 క్వింటాళ్లు పత్తిని కొనుగోలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో త్వరలోనే సిసిఐ నుంచి ఆదేశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో డిఎస్పి మొగిలయ్య, సిసిఐ ప్రతినిధి రాహుల్, మార్కెటింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.