17-11-2025 10:03:54 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీరాంబట్ల వేణుగోపాల శాస్త్రిను విధుల నుండి తొలగించాలని సోమవారం మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ మంద అనిత, పాత బెల్లంపల్లి మాజీ సర్పంచ్ బూట్ల వెంకటలక్ష్మి, మైనార్టీ నాయకులు ఎండి గౌస్ లు దేవాదాయ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిశీలకులు రంగు రవి కిషన్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా ఒక మహిళా భక్తురాలపై అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దేవస్థానానికి వచ్చే మహిళల పట్ల అమర్యాదగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో మహిళలు దేవస్థానానికి రావడానికి భయపడుతున్నారని వారు పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అర్చకులు వేణుగోపాల శాస్త్రిని దేవాదాయ శాఖ అధికారులు గతంలో అనేకసార్లు సస్పెండ్ చేసినప్పటికీ పరిస్థితి లో మార్పు రావడంలేదని పేర్కొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దేవస్థానానికి కళంకం తీసుకు వస్తున్న అర్చకులు వేణుగోపాల శాస్త్రిని వెంటనే విధుల నుండి తొలగించి మహిళలకు రక్షణ కల్పించాలని వారు కోరారు. అర్చకులు వేణుగోపాల శాస్త్రి పై రాష్ట్ర దేవాదాయ శాఖ విజిలెన్స్, జాయింట్ కమిషనర్ కు భక్తుల నుండి ఫిర్యాదులు అందడంతో అతనిపై విచారణకు వచ్చినట్లు పరిశీలకులు రంగు రవి కిషన్ గౌడ్ తెలిపారు. జాయింట్ కమిషనర్ కృష్ణవేణి ఆదేశాలతో భక్తులను విచారించినట్లు చెప్పారు. అర్చకులు వేణుగోపాల శాస్త్రిని దేవస్థానంలో పూజలకు అనుమతించవద్దని క్లర్క్ భానును ఆయన ఆదేశించారు.