calender_icon.png 14 November, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు చేయాలి

14-11-2025 01:48:32 AM

అశ్వాపురం, నవంబర్ 13 (విజయక్రాంతి):కిసాన్ కపాస్ యాప్ రిజిస్ట్రేషన్ ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అశ్వాపురం మండలంలోని మొండికుంటలో జరిగిన రైతు సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ వ్యవసాయ సీజన్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పత్తి పొలాల్లో నీరు నిల్వ ఉండి, మొక్కలు వేర్ల దగ్గర పాడై, ఆకులు రాలిపోవడంతో పాటు కాయలు నల్లబారడం వల్ల పంట దిగుబడి మూడవ వంతుకు పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అరకోరగా రైతు చేతికి వచ్చిన పత్తిని కూడా సిసిఐ కఠిన నిబంధనల పేరుతో కొనుగోలు చేయడం లేదని అన్నారు. జిల్లాలో ప్రారంభించిన సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో కూడా ఈ కారణాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ట్రేడర్లు రైతుల బలహీనతను ఆసరాగా తీసుకొని చాలా తక్కువ ధరలకు పత్తిని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కిసాన్ కపాస్ యాప్ రిజిస్ట్రేషన్ విధానం తీసుకువచ్చి, అనేక కఠిన నిబంధనలు పెట్టి పత్తి రైతులను గోస పెడుతోందని విమర్శించారు. రిజిస్ట్రేషన్లో అనేక టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

తేమశాతం 812 శాతం నిబంధన, ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్ల కొనుగోలు పరిమితి, నాణ్యత ప్రమాణాలు వంటివి రైతులకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. ఈ నిబంధనలను సడలించి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు రూ.8110ను రైతులకు అందించాలని కోరారు. వ్యవసాయ మార్కెట్ ఆవరణలోనే సిసిఐ కొనుగోలు జరిపితే రైతులకు సౌకర్యంగా ఉంటుందని, ప్రభుత్వప్రైవేటు ట్రేడింగ్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని సూచించారు.

ప్రస్తుతం జిన్నింగ్ మిల్లుల్లో సిసిఐ కొనుగోలు చేయడం వల్ల, కొనుగోలు కాని పత్తిని తిరిగి మార్కెట్కి తీసుకురావడం రైతులకు అదనపు ఆర్థిక నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో 2,27,000 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు జరిగిందని, ఈ సీజన్లో దిగుబడి తగ్గడం, ధరలు పడిపోవడంతో వందల కోట్ల రూపాయల నష్టం రైతులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

రైతుల సమస్యల పరిష్కారానికి ఐక్య రైతు ఉద్యమే మార్గమని అన్నవరపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సంఘం అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి సాంబశివరావు, నాయకులు వెంకన్న, రాములు, అశోక్ రెడ్డి, మోహన్ రెడ్డి, రాఘవులు, వెంకటరమణ, దండి రాములు తదితరులుపాల్గొన్నారు.