calender_icon.png 14 November, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూడిద గుట్టలు!

14-11-2025 01:12:57 AM

రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో 10 కోట్ల మెట్రిక్ టన్నులకుపైగా నిల్వ

-సిమెంట్, ఇటుకల ఫ్యాక్టరీలకు ఉపయోగిస్తున్నది స్వల్పమే 

-ప్రత్యేక కార్యాచరణ దిశగా ప్రభుత్వం దృష్టిపెట్టాలి

-రోడ్లు, మౌలిక వసతులు, మైనింగ్ రంగంలో వినియోగంపై అధ్యయనం అవసరం

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న బూడిద ఆందోళనకరంగా మారుతోంది. థర్మల్ విద్యుత్తు కేంద్రాలలో బొగ్గును మండించడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. అయితే పేరుకుపోతున్న బూడిద సమస్య ఏటికాయేడు పెరిగిపోతుండటమే ఆందోళనకు కారణం.

రోజురోజుకూ థర్మల్ విద్యు త్తు కేంద్రాల్లో బూడిద నిల్వలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో 5,580 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్  కేంద్రాలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి.  అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, గత నెలవరకు పరిశీలిస్తే.. ఆయా థర్మల్ కేంద్రాల వద్ద ఉన్న బూడిద నిల్వలు కనీ సం 10 కోట్ల మెట్రిక్ టన్నులు.

అత్యధికం గా కొత్తగూడెం ప్రాంతంలో (స్టేజ్ 5, 6 మరియు 7) నిర్మించిన థర్మల్ విద్యుత్తు కేంద్రాలను 1,800 మెగావాట్ల సామర్థ్యం తో ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో స్టేజ్ 5లో ఉన్న 500 మెగావాట్ల థర్మల్ విద్యు త్తు కేంద్రాల నుంచి వచ్చిన బూడిద (సెప్టెంబర్ నాటికి) సుమారు 809.2416 లక్ష ల మెట్రిక్ టన్నులు.. అంటే 8.92 కోట్ల మెట్రిక్ టన్నుల బూడిద గుట్టలుగా, యాష్ పాండ్‌లోనూ పేరుకుపోయి ఉంది. ఇక స్టేజ్ 500 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న ప్లాంట్ నుంచి వచ్చే బూడిద (సెప్టెంబర్ నాటికి) 12.51 లక్షల మెట్రిక్ టన్నులు పేరుకుపోయింది.

అలాగే స్టేజ్ 7లో సెప్టెంబర్ చివరినాటికి 33.55 లక్షల మెట్రిక్ టన్నుల పాండ్ యాష్ పేరుకుపోయింది. ఇలా కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి, రామగుండం ఎక్కడ చూసినా బూడిద గుట్టలు, బూడిద నీరు (పాండ్ యాస్) పేరుకుపోవడం గమనార్హం. ఇలా రాష్ట్రం మొత్తంపై అక్టోబర్ చివరినాటికి సుమారు 10 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా బూడిద పేరుకుపోయినట్టుగా గణాంకాలనుబట్టి తెలుస్తున్నది.

నామమాత్రంగా వినియోగం..

--థర్మల్ విద్యుత్తు కేంద్రాల నుంచి వెలువడే బూడిద, బూడిదతోకూడిన నీటి ని ఉపయోగించుకునేందుకు కొన్ని సంస్థలు, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు మాత్రమే ముందుకు వస్తున్నాయి.

--కొత్తగూడెం స్టేజ్ ఈ సెప్టెంబర్ నాటికి బ్రిక్స్, సిమెంట్ పరిశ్రమలకు తరలించిన మొత్తం బూడిద 233368 మెట్రిక్ టన్నులు మాత్రమే.

--కొత్తగూడెం స్టేజ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి ఉపయోగిం చిన బూడిద కేవలం 1,42,541 మెట్రిక్ టన్నులే.

--భద్రాద్ర థర్మల్ విద్యుత్తు కేంద్రం (బీటీపీఎస్ మెగావాట్లు) విషయ మే పరిశీలిస్తే.. అక్టోబర్ నెలలో ఈ బీటీపీఎస్ నుంచి 39463 మెట్రిక్ టన్నుల ఈఎస్‌పీ డ్రైయాష్, 9865 మెట్రిక్ టన్నుల వెట్ యాష్ వెలువడింది. కానీ ఇందులో 14617 మెట్రిక్  టన్నుల డ్రై ఈఎస్‌పీ యాష్, 24.31 మె ట్రిక్ టన్నుల పాండ్ యాష్ మాత్రమే వివిధ ఫ్యాక్టరీలకు ఉపయోగించారు. ఒక నెలలో మొత్తం సుమారు 48 వేల మెట్రిక్ టన్నుల బుడిద బయటకు వస్తే.. అందులో వినియోగించుకుంది కేవలం 15 వేల మెట్రిక్ టన్నుల లోపే కావడం గమనార్హం. అంటే ఒక నెలలోనే సుమారు 33 వేల మెట్రిక్ టన్ను లకుపైగా బూడిద వివిధ రూపాల్లో అలాగే పేరుకుపోయింది. అక్టోబర్ చివరి నాటికి బీ టీపీఎస్ పరిధిలో 71.40 లక్షల మెట్రిక్ ట న్నుల బూడిద నిల్వలు పేరుకుపోవడం గమనార్హం.

-కొత్తగూడెంలో ఉన్న థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు (స్టేజ్ 5, 6, 7) సంబంధించి బయటకు వచ్చే బూడిదను గుట్టలుగా పోయడం వలన సుమారు 4 చదరపు కి.మీ మేర స్థలం ఈ బూడిద గుట్టలతోనే నిండిపోవడాన్ని మనం గమ నించవచ్చు.

రాయితీలు..

థర్మల్ విద్యుత్తు కేంద్రాల నుంచి వచ్చే ఈ బూడిదతో పర్యావరణానికి, ప్రజలకు ఎప్పటికైనా ఆందోళన తప్పదు. ఈ నేపథ్యంలో నిర్మాణ, మౌలిక వసతుల కల్పన తదితర రంగాల్లో ఈ బూడిదన ఎక్కువగా వినియోగించడంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు క్రియాశీలకంగా ఉండే ఫ్యాక్టరీలు మరింత బూడిదను వినియోగించేలా ప్రోత్సహకాలపైకూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

అటు ప్రజలకు, ఇటు పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే.. ప్రభుత్వ పరంగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక వసతుల కల్పన, రోడ్లు వేయడం లాంటివాటిల్లో ఈ బూడిదను వినియోగించుకునే అవకాశంపై అధ్యయనం చేయడంతోపాటు ఆ అవకాశం ఉంటే అక్కడ కూడా రాయితీలు, సబ్సిడీలు లాంటివాటిని ప్రకటించి ఈ బూడిద నిల్వలను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చూడాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రజలకు, పర్యావరణానికి ఇబ్బందులు తప్పవు..!

సమగ్ర అధ్యయనం అవసరం.. 

ఇంత భారీ ఎత్తున పేరుకుపోతున్న బూడిద నిల్వలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేదానిపై సమగ్రమైన అధ్యయనం అవసరం ఉంది. పర్యావరణకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఉండేలా ఈ బూడిదను వివిధ మార్గాల్లో వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే థర్మల్ విద్యుత్తు కేంద్రాలున్న ప్రాంతాలు, గ్రామాలు, ప్రజ లు ఈ బూడిద ప్రభావంతో విలవిలాడుతున్నవారే.

భూపాలపల్లిలోని కేటీపీపీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతోకాలం ఈ బూడిదపై పోరాటం చేసినవారే. అటు కొత్తగూ డెం చుట్టుపక్కల అయినా ఇదే సమస్య ఉంది. రాబోయే కాలంలో యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం చుట్టుపక్కల అయినా బూడిద నిల్వలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈఎస్‌పీ డ్రై యాష్, పాండ్ యాష్‌ను వినియోగిస్తున్న సిమెంటు, ఇటుకల రంగంతోపాటు.. ఇతర రంగాల్లో ఎలా ఉపయోగించుకోవచ్చనేదానిపై పర్యావరణవేత్తలు, ఇంజనీర్లు, నిపుణులతో అధ్యయనం చేయాలి.

వినూత్నంగా ముందుకు.. 

రాష్ట్రంలో వేలాది కి.మీ మేర రోడ్లను వేస్తున్నారు. ఈ బూడిదను ఈ రోడ్లకు వినియోగించుకునే అవకాశం ఉందా అనే కోణంలో అధ్యయనం అవసరం. అలాగే మైనింగ్ రంగంలో లోతైన చెరువులుగా తవ్వకాలు చేసిన ప్రాంతాలను పర్యావరణకు ఎలాంటి ప్రమాదం లేకుండా.. ఈ బూడిదతో నింపవచ్చా.. అనే కోణంలోనూ నూతన సాంకేతిక పద్ధతులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న సిమెంటు, బ్రిక్ పరిశ్రమలతోపాటు.. నిర్మాణ రంగంలో ఈ బూడిదను పెద్ద ఎత్తున ఉపయోగించుకునే అవకాశం ఉందా.. లేదా అనేదానిపైకూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సిమెంటు, ఇటుకలకు మాత్రమే..

థర్మల్ విద్యుత్తు కేంద్రాల నుంచి వెలువడుతున్న బూడిదను ఇప్పటి వరకు కేవలం సిమెంటు, ఇటుకల ఫ్యాక్టరీలు మాత్రమే తమ ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నారు. ప్రతినెలా థర్మల్ విద్యుత్తు కేంద్రాల నుంచి లక్షల మెట్రిక్ టన్నుల్లో వెలువడుతున్న బూడిదలో వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ సిమెంటు, ఇటుక (బ్రిక్స్) ఫ్యాక్టరీలు ఉపయోగిస్తున్నాయి. దీనితో భారీగా పేరుకుపోతున్న బూడిదను ఏం చేయాలనేదానిపై సమగ్రమైన కార్యాచరణ మాత్రం ప్రభుత్వం వద్ద కనపడటంలేదు.