calender_icon.png 14 November, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పెద్ద’ల జిల్లాలో..పేదలకు న్యాయమేది?

14-11-2025 12:35:24 AM

  1. ఆగని మూడవ కల్లు డిపో బాగోతాలు న్యాయం కోరుతున్న గౌడన్నలు 
  2. ప్రజా ప్రతినిధులకు వినతులు ప్రజావాణి పిర్యాదులు బుట్టదాఖలు 
  3. కలెక్టర్ పైనే భారం నేడు ఎందుకు రమ్మన్నట్టు లేబర్ శాఖకు పట్టదేలా  కో ఆపరేటివ్ మౌనమేల

నిజామాబాద్, నవంబర్ 13:(విజయ క్రాంతి) : అందరూ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైన మూడవ కల్లు డిపో సభ్యుల పరిస్థితి. ఎలాగంటే.. రాష్ట్ర రాజకీయాల్లో నిజామాబాద్ జిల్లా నేతల హవా నడుస్తోంది. కీలకమైన పదవులన్నీ జిల్లా నేతలకే దక్కాయి.

కానీ, ‘అందరూ ఉన్నా అల్లుడి నోట్లో శని‘ అన్నట్లుగా, సొంత జిల్లా కేంద్రంలోని మూడవ కల్లు డిపో సభ్యులకు, కార్మికులకు, గౌడ కుటుంబాలకు మాత్రం న్యాయం జరగడం లేదనే ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. సొంత సామాజిక వర్గానికి (గౌడ) చెందిన వ్యక్తే పీసీసీ పగ్గాలు చేపట్టినా, తమ గోడును పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.

అధికార పీఠంపై జిల్లా పెద్దలే.. 

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు అత్యంత కీలక స్థానాల్లో ఉన్నారు. వీరి జాబితా చూస్తే: బొమ్మ మహేష్ కుమార్ గౌడ్: సాక్షాత్తూ రాష్ట్ర కాంగ్రెస్ సారథి (టీపీసీసీ అధ్యక్షులు) మరియు గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు. పీ. సుదర్శన్ రెడ్డి: మాజీ మంత్రి మరియు ప్రస్తుతం ఆరు హామీలు, సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు.

షబ్బీర్ అలీ: మాజీ మంత్రి మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఇతర నేతలు: వీరితో పాటు జిల్లాకు చెందిన మరో ఐదుగురు వివిధ కార్పొరేషన్లకు రాష్ట్ర చైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా మేజిస్ట్రేట్: ఇక, జిల్లా పరిపాలనా అధినేతగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉన్నారు. ఇంత మంది ‘పెద్దలు‘ జిల్లాకు చెందిన వారే అయినా, నిజామాబాద్ నడిబొడ్డున ఉన్న మూడవ కల్లు డిపో సమస్యను పరిష్కరించడంలో మాత్రం విఫలమవుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

 అసలేమిటి వివాదం? 

గత కొంతకాలంగా నిజామాబాద్ మూడవ కల్లు డిపో నిర్వహణ, సభ్యుల హక్కులు మరియు కార్మికుల సంక్షేమం విషయంలో అనేక వివాదాలు నడుస్తున్నాయి. డిపో నిర్వహణలో పారదర్శకత లోపించిందని, కొందరికే లబ్ధి చేకూర్చేలా వ్యవహారాలు నడుస్తున్నాయని, అర్హులైన గౌడ కుటుంబాలకు, కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఈ డిపో అనేకసార్లు వార్తల్లో నిలిచింది. తమకు న్యాయం చేయాలని బాధితులు జిల్లా స్థాయి అధికారుల నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యంగా ఉందని అంటున్నారు.

తాజా పరిణామాలు.. పెరిగిన అనుమానాలు.. 

సమస్యను పరిష్కరించాల్సిన  అధికారులు, నేతలున్న ఈ తరుణంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు బాధితులలో మరిన్ని సందేహాలను, ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.

14వ తేదీ మీటింగ్ ఎందుకు?

ఈ నెల 14వ తేదీన (శుక్రవారం) మూడవ డిపో డైరెక్టర్లను ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఎందుకు రమ్మన్నారు? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం సాధారణ పిలుపా? లేక తెర వెనుక ఏదైనా మతలబు ఉందా? అని సభ్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కరితోనే మంతనాల మర్మమేమిటి?

ఇటీవలే, జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి, డిపో విషయాల్లో ‘విజ్ఞానవంతుడు‘ అని చెప్పుకునే ఒక్క వ్యక్తిని మాత్రమే పిలిచి రహస్యంగా మంతనాలు జరపడం తీవ్ర చర్చనీయాంశం అయింది. సమస్యను అందరితో చర్చించి పరిష్కరించకుండా, ఏకపక్షంగా ఒక్కరితోనే మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏమిటని మిగతా సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా, రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పుతున్న జిల్లా నేతలు, ప్రభుత్వ సలహాదారులు, మరియు జిల్లా కలెక్టర్ ఈ విషయంలో తక్షణం స్పందించాలని, మూడవ కల్లు డిపో వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి, నష్టపోయిన గౌడ కుటుంబాలకు, కార్మికులకు న్యాయం చేయాలని జిల్లా ప్రజానీకం కోరుకుంటోంది. లేనిపక్షంలో, ఇంత మంది పెద్దలు అధికారంలో ఉండి ఏం లాభం అనే నిందను వారు మోయక తప్పదు.