14-11-2025 01:02:02 AM
-రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని హస్తిన తీసుకెళ్లాలి
-కేంద్రంపై పోరాడేందుకు కాంగ్రెస్ కార్యాచరణ ప్రకటించాలి
-బీసీలను మోసంచేస్తే తిరుగుబాటు తప్పదు
-రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే అగ్గిరాజేస్తాం
-బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక
ముషీరాబాద్, నవంబర్ 13, (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ చేపట్టిన ధర్మపోరాట దీక్షలతో ఢిల్లీ దిగిరావాలని బీసీ జేఏ సీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ కోటా విషయంలో కేం ద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు.
పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై పోరాటానికి రాజకీయ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీ తో కొట్లాడుతారో, బీసీల ముందు దోషులుగా నిలబడతారో కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చుకోవాలన్నారు. బీసీలను నమ్మించి మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచాలని, బీసీ రిజర్వేషన్ల సాధనకు రాజ్యాంగాన్ని సవరించాలని ప్రధాన డిమాండ్‌తో గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన బీసీ ధర్మ పోరాట దీక్షలో ప్రొఫెసర్ కోదండరాం, జూలూరి గౌరీ శంకర్, గిరిజన సంఘం నాయకులు సంజీవ నాయక్, సీపీఎం నేత ఆశన్న, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్, ప్రొఫెసర్ బాగయ్యతో పాటు 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, 40 బీసీ సంఘాల అధ్యక్షులు, 10 ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, మహిళా సంఘాల నేతలు, ఓయూ జేఏసీ నేత లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబ ద్ధత కల్పించకుండా స్థానిక ఎన్నికలకు వెళితే బీసీలు రాష్ట్రంలో అగ్గి రాజేస్తారని హెచ్చరించా రు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే బీసీల ముందు దోషిగా నిలబడుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించడానికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీలు పోరాడుతారని 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించడం న్యాయమైనదేనని అన్నా రు.
బీసీలు వెనుకబడి ఉన్నారని కమిషన్లు తేల్చినప్పుడు, జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటే తప్పులేదన్నారు. బీసీల వాటా దక్కితినే దేశంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. బీసీల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు దత్తాత్రేయ ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ నేతలు మధుసూదన్ చారి, వి శ్రీనివాస్‌గౌడ్, ఎల్ రమణ డిమా ండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో కాంగ్రెస్ పోరాడితే బీఆర్‌ఎస్ కూడా మద్దతు ఇస్తుందని తెలిపారు.
ముఖ్యమంత్రిని ఒప్పిస్తాం
అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లడానికి సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పిస్తామని కాంగ్రెస్ నేతలు మధు యాష్కీగౌడ్, అద్దంకి దయాకర్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా బీజేపీ అడ్డుపడుతోందని విమర్శించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి, పార్లమెంట్ వేదికగా బీసీల తరఫున పోరాడడానికి కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ దృష్టి సారించాలని కోరుతామన్నారు. బీసీలకు అన్యాయం జరిగే చర్యలు కాంగ్రెస్ ఎప్పుడూ తీసుకోదన్నారు.
బీసీల ధర్మ పోరాట దీక్షలో బీసీ సంఘాల జేఏ సీ, అఖిలపక్ష నేతలు, బీసీ యువజన సం ఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మ, సం చారజాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరస్వా మి, బీసీఏ కులాల అధ్యక్షులు ప్రొఫెసర్ భాగ య్య, బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు మ ని మంజరి సాగర్, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడుఈడిగ శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.