14-11-2025 12:55:48 AM
-కొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు షురూ
-మధ్యాహ్నానికి వీడనున్న ఉత్కంఠ
-యూసుఫ్‌గూడ స్టేడియంలో 42 టేబుళ్లపై 10 రౌండ్లలో లెక్కింపు
-విజయంపై కాంగ్రెస్ ధీమా.. ఆశలు వదులుకోని బీఆర్‌ఎస్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): హోరాహోరీ ప్రచారం, చెదురుమదురు ఉద్రిక్తతల నడుమ ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది అంకానికి చేరుకుంది. రాష్ర్టవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన ఎన్నిక ఫలితం నేడు మరికొద్ది గంట్లో జరగనున్న ఓట్ల లెక్కింపుతో బరిలో నిలిచిన 58 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ ఫలితం కేవలం జూబ్లీహిల్స్ కొత్త ఎమ్మెల్యేను ఎన్నుకోవడమే కాకుండా, రాష్ర్ట రాజకీయ సమీకరణాలపై, ప్రధాన పార్టీల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది.
సీఎం రేవంత్‌కు అగ్నిపరీక్ష
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న అత్యంత కీలకమైన ఈ ఉపఎన్నిక.. ఆయన రెండేళ్ల పాలనకు ఒకవిధంగా రెఫరెండంగా మారిం ది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హైడ్రా వంటి సంచలన నిర్ణయాల నేపథ్యంలో ప్రజల నాడి ఎలా ఉందో ఈ ఫలితం తేల్చనుంది.
ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే, రేవం త్‌రెడ్డి నాయకత్వానికి, ఆయన ప్రభుత్వ విధానాలకు ప్రజల ఆమోదం లభించినట్లవుతుంది. ఇది అధిష్టానం వద్ద ఆయన పలుకుబడిని పెంచడమే కాకుండా, రాబోయే స్థానిక సంస్థలు, జీహెఎంసీ ఎన్నికలకు పార్టీకి నూతనోత్సాహాన్ని ఇస్తుంది. ఒకవేళ ఫలితం ప్రతికూలంగా వస్తే, అది ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతంగా భావించి, పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గాలు ఏకమయ్యే ప్రమాదం ఉంది.
విజయంపై ఎవరి ధీమా వారిదే
దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు తమకే పట్టం కట్టడంతో అధికార కాంగ్రెస్ విజయంపై పూర్తి విశ్వాసంతో ఉంది. ప్రభుత్వ పనితీరు, స్థానిక అభ్యర్థిపై ఉన్న సానుకూలత తమను గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పోలింగ్‌కు ముందు వరకు గెలుపుపై ధీమాగా ఉన్న గులాబీ పార్టీ, ఎగ్జిట్ పోల్స్ తర్వాత కొంత ఆత్మరక్షణలో పడింది. చివరి మూడు రోజుల పోల్ మేనేజ్‌మెంట్‌లో వైఫల్యం చెందామనే అంతర్మ థనం ఆ పార్టీలో కనిపిస్తోంది. అయినప్పటికీ, కేటీఆర్ సహా ముఖ్య నేతలు గెలుపుపై ధీమా ప్రదర్శిస్తున్నారు.
పోలీసుల అండతో కాంగ్రెస్ దొంగ ఓట్లు వేయించిందని, దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపిస్తూనే, క్షేత్రస్థాయిలో ఓటర్లు తమవైపే నిలిచారని ఆశిస్తున్నారు. ఈ ఎన్నికలో బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. కనీసం డిపాజిట్ దక్కుతుందా లేదా అన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది. ఈ ఫలితం రాష్ర్ట బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల నాయకత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఏర్పాట్లు పూర్తి చేశాం: జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. గురువారం యూ సుఫ్‌గూడలోని మీడియా సెంటర్‌లో డీఈ ఓ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. ‘శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. నోటాతో కలిపి 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున, ఈసీఐ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ సారి 42 టేబుళ్లను ఏర్పాటు చేశాం.
మొత్తం లెక్కింపు ప్రక్రియ గరిష్టంగా 10 రౌండ్లలో పూర్తవుతుంది’ అని వివరించా రు. కౌంటింగ్ ప్రక్రియ కోసం 186 మంది సిబ్బందిని నియమించామని, వీరిలో కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు ఉంటారని తెలిపారు. ఈసీఐ సాధారణ పరిశీలకులు మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తారని చెప్పా రు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా, ఈసీ యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
అన్ని విభాగాల పోలీసు బృం దాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని, కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. కేవలం అనుమతి ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లకు మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు.