22-04-2025 12:00:00 AM
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా టారిఫ్‌లపై ప్రపంచ దేశాలు తర్జనభర్జనలు పడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం సందర్భంగా 2030 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. ఇది కార్యరూపం దాలిస్తే భారత్ ఆర్థికంగా మరింత నిలదొక్కుకోగలదు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా తమ వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి చేయాలనుకుంటున్నట్టు తెలుస్తున్నది.
2021 మధ్య అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. మన దేశ ఎగుమతుల విలువ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల విలువకంటే ఎక్కువ. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికాతో భారత్ 41.18 బిలియన్ డాలర్ల ట్రేడ్ సర్‌ప్లెస్‌లో ఉంది. 2024లో అగ్రరాజ్యానికి ఇండియా డ్రగ్స్ ఫార్ములా, బయలజికల్స్, టెలికామ్ పరికరాలు, విలువైన రాళ్లు, పెట్రోలియం ఉత్పత్తులు, బంగారు ఆభరణాలు, కాటన్ దుస్తులు, ఉపకరణాలు, ఐరన్, స్టీల్ ఉత్పత్తులను ఎగుమతి చేసింది.
ఇదే సమయంలో అమెరికా నుంచి క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తులు, కోల్, కోక్, పాలిష్ చేసిన వజ్రాలు, విద్యుత్ యంత్రాలు, విమానాలు, దాని విడిభాగలతోపాటు బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. అయితే, ఇండియా ట్రేడ్ సర్‌ప్లెస్ ఏటా పెరుగుతుండటం పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే భారత్‌పై అమెరికా 26 శాతం సుంకాలు విధించడానికి కారణమైంది. ప్రస్తుతం ఇరు దేశాలమధ్య పరస్పర ప్రయోజన సుంకాల ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ బృందం గత నెల చివరి వారంలో భారత్‌లో పర్యటించి పలు అంశాలను చర్చించింది.
భారత వాణిజ్యశాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఈనెల 23 నుంచి అమెరికాలో పర్యటించి టారిఫ్‌ల అంశాన్ని చర్చించనున్నారు. ఈ తరుణంలో వాన్స్ ఆంధ్రప్రదేశ్ మూలాలున్న తన భార్య ఉషా వాన్స్‌తో కలిసి భారత పర్యటనకు రావడం ఆసక్తికరం. అగ్రరాజ్యం ఉత్పత్తుల వారీగాకాక రంగాల వారీగా టారిఫ్‌లను నిర్ణయించడానికి ఆసక్తి చూపుతున్నది.
రంగాల వారీగా టారిఫ్‌ల అమలుకు భారత్ మొగ్గు చూపితే దేశవ్యాప్తంగా రైతులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. సోయాబీన్, మొక్కజొన్న, బాదాం, జీడిపప్పు వంటి వ్యవసాయ ఉత్పత్తులను భారత్‌కు అమెరికా ఎగుమతి చేస్తున్నది. పరస్పర ప్రయోజన సుంకాల ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి ఈ ఉత్పత్తులను తక్కువ టారిఫ్‌లకు ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడి ఉప్పత్తిదారులకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.
ఈమధ్య కాలంలో భారతీయ విద్యార్థులకు అమెరికా చాలా తక్కువ సంఖ్యలో స్టూడెంట్ వీసాలను మంజూరు చేస్తున్నది. అలాగే, ఇప్పటికే అమెరికాలో ఉన్న విద్యార్థుల వీసాలనూ రద్దు చేస్తున్నది. దీంతో భారతీయుల్లో ఆందోళన నెలకొంది. అయితే, వాన్స్ భారత పర్యటనతో ఈ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.