07-07-2025 10:30:34 PM
టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ...
మంచిర్యాల (విజయక్రాంతి): ప్రతి మత్స్య సొసైటీ, జల వనరులకు సరిపడెంత ఉచిత చేప, రొయ్య పిల్లలకు మత్స్య సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని చార్వక హాస్పిటల్లో మత్స్యకారుల జిల్లా సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. వర్షాకాలం ప్రారంభమైనా చేప, రొయ్య పిల్లల విషయంలో నిర్దిష్టమైన ప్రకటన చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎలాంటి టెండర్లు లేకుండా మత్స్య సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ సి డి సి, ఎన్ ఎఫ్ డి బి నిధులను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ మత్స్యకారులంతా జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలో 5 ఎకరాల స్థలం, రూ. 20 కోట్లతో ఆధునాతనమైన సౌకర్యాలతో హోల్ సేల్ చేపల మార్కెట్ నిర్మించి వేలాది మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనీ కోరారు. జిల్లా కేంద్రంలో మత్స్యకారులకు ఎకరం స్థలం, రెండు కోట్లు కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, చెరువులు కుంటలు కబ్జాల నుంచి కాపాడి మత్స్యకారుల వృత్తి లక్షణ, ఉపాధి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 21న జరిగే మత్స్యకారుల చలో కలెక్టరేట్ ల కార్యక్రమంలో వేలాది మంది మత్స్యకారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి బోడంకి చందు, తుమ్మ రేణుక, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు సంకె రవి, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి పాయిరాల రాములు, ఎర్రోళ్ల రాజేష్, జనవరి నారాయణ, బోడంకి మహేష్, కంపల చంద్రయ్య, పిట్టల దశరథం, మంచర్ల రాజేందర్, గగ్గూరి రాజన్న, జిల్లాల శ్రీనివాస్, బోగుట వెంకటేష్, నాగుల మహేష్, పానెం రాజన్న, డోకే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.