07-07-2025 10:51:35 PM
సిఐటియు జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి..
జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి జి వి మాల్ యాజమాన్యానికి సమ్మె నోటీస్..
మణుగూరు (విజయక్రాంతి): కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్ కోడ్ ల రద్దుకు వ్యతిరేకంగా జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, సిఐటియు జిల్లా అధ్యక్షులు కొలగాని బ్రహ్మచారి(CITU District President Kolagani Brahmachari) అన్నారు. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో స్థానిక జివి మాల్ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ను అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ... మోడీ సర్కార్ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు కార్మిక వర్గానికి మరణం శాసనం రాస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా కార్మిక, రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు.
సామాన్యులపై భారాలు మోపుతూ కార్పొరేట్ సంస్థలకు స్వదేశీ, విదేశీ సంపన్నులకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ పేద ప్రజలపై పన్నుల భారాలు మోపుతుందని మండిపడ్డారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తదితర నిత్యవసర సరుకుల ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా విదేశీ కార్పొరేట్లకు కట్టబెడుతుందని విమర్శించారు. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ వంటి కనీస సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న కార్మిక, ఉద్యోగ ప్రజాసంఘాలపై ఉక్కు పాదం మోపుతుందని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్లో సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి, సామాన్యులపై భారాలు విధిస్తూ కార్పొరేట్ సంస్థల సంపన్నులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి ప్రజాధనాన్ని లూటీ చేస్తుందని, ద్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనంఇవ్వాలని డిమాండ్ చేశారు. 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు అత్యధికంగా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు, బండారి సారిక, సౌందర్య, రమేష్, సరిత, తదితరులు పాల్గొన్నారు.