05-10-2025 12:00:00 AM
ఫోరం కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ వెల్లడి
ముషీరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేష నల్ సంస్థపై నాంపల్లి ఎంఎస్జే కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రకారం డీఎఫ్‌ఐ ఆస్తులను ఈ వేలం వేసి వచ్చిన మొత్తం డబ్బును బాధితులను చెల్లించాలని ఆదేశించినట్లు ధన్వంతరి బాధితుల ఫోరం కన్వీనర్ గిరి ప్రసాద్ శర్మ తెలిపారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధన్వంతరి బాధితుల ఫోరం కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ సీసీఎస్ విచారణలో బాధితులు మొత్తం 4,400 మంది అని నిర్ధారణ అయ్యిందని వివరించారు.
రియల్ ఎస్టేట్ అనే రంగం అసలు ధన్వంతరి ట్రస్ట్ పరిధిలో లేదన్నారు. అయినప్పటికీ, నిందితుడు కమలాకర్ శర్మ తన భార్య డాక్టర్ జయశ్రీతో కలసి కుట్రపన్ని ధన్వంతరి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగించారని పేర్కొన్నారు. వారితో పాటు మరణించిన వెన్నెలగంటి సుబ్బారావు(జనరల్ సెక్రటరీ), ఖండవల్లి పద్మ(డైరెక్టర్), పీసపాటి సత్యశ్రీ, ఆకెళ్ళ అనురాధ లతో కలిసి ముఠాగా ఏర్పడి 20 శాతం కూడా పూర్తి అవ్వని వెంచర్లను 100 శాతం పూర్తి అయ్యాయని, ధన్వంతరి వాణి అనే వారి మాస పత్రికలో మోస పూరిత ప్రకటనలు ఇచ్చి, బ్రాహ్మణ కుటుంబాల ఇళ్లలోకి వెళ్లి కోట్లలో మోసం చేశారని ఆరోపించారు.
ధన్వంతరి లోగో, ధన్వంతరి ట్రస్ట్ పేరును వాడుకునే అర్హత నిందితుడు కమలాకర్ శర్మకు లేదని పాత ట్రస్టీలు ఖండించారు. ధన్వంతరి బాధితులకు అసలు, వడ్డీ, నష్టపరిహారం అందించాలని అన్నారు. నిందితు డు ధన్వంతరి బాధితుల డబ్బులతోనే ఆస్తులు కొన్నాడు కనుక ఆస్తులన్నీ బాధితులకే చెందాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం, కోర్టులకు అనుగుణంగా వేగంగా చర్యలు తీసుకున్న డీసీపీ శ్వేతా రెడ్డి, ఏసీపీ ఆదినారాయణ,
హెడ్ కానిస్టేబుల్ అశోక్ లకు బాధితుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేలం ద్వారా ధన్వంతరి రియల్ ఎస్టేట్ ఆస్తులన్నీ అమ్మి వచ్చిన మొత్తం డబ్బును బాధితులకు అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఫోరం సభ్యులు రాధా రోహిణి, పరిమళ, సరళ దేవి, విజయలక్ష్మి, ఛాయాదేవి, వీణ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.