28-08-2025 12:17:18 PM
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్‌లో గణేష్ విగ్రహాల ప్రమాదంపై వస్తున్న అసత్య ప్రచారంపై పోలీసు కమిషనర్ గౌష్ ఆలం(Police Commissioner Gaush Alam) వివరణ ఇచ్చారు. కరీంనగర్‌లో గణేష్ విగ్రహం కరెంటు తీగలకు తగిలి 9 మంది మరణించారనే వార్త పూర్తిగా అవాస్తవం అని కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం గారు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు వాస్తవాలు తెలుసుకోకుండా ఈ అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. కరీంనగర్ జిల్లాలో అటువంటి విద్యుత్ ప్రమాదం ఏదీ జరగలేదని స్పష్టం చేశారు.
నాలుగు నెలల క్రితం కోరుట్లలో గణేష్ విగ్రహాల తయారీ సందర్భంగా జరిగిన ప్రమాదాన్ని కొంతమంది ఇప్పుడు ఫార్వర్డ్ చేయడం వలన అది కరీంనగర్లో జరిగినట్టుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన వివరించారు. ప్రజలందరూ ఇలాంటి తప్పుడు కథనాలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల్లో నకిలీ వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.